మనమంతా బంధువులం…నిజమేకదా ! (కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి

అవును ఆ ‘కొయ్యగుర్రానికి
అంతా తెలుసు’
అంతటా వివక్ష
అన్నింటా మొద్దునిద్ర
ఓ రామచంద్రప్రభో!
‘మల’య పర్వత నివాసిని
నేను ‘గోసంగి’ని ఆలకించయా
అనాదిగా సాగుతూనే ఉంది
అన్నదమ్ముల సంగ్రామం
దారి చూపమంటే
దాడిచేస్తారా తండ్రీ!!
పేటకి గూడేనికి
తోరణం కడదామంటే
మామి’డాకు’లతో
గుచ్చుతూనే ఉన్నారయా
ధారపు బంధం నాదే
దారం కూడా నాదే
ఈ ధరణీసుతునకు
నిలువ నీడలేదు
చూసావా రారాజా
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా
ఈ గిజిగాడికింత వడపప్పు
దాహార్తి కి మధుర పానమిస్తే
చాలుగదా రాధేయ
అవే మాకు పంచభక్ష్య
పరమన్నాలు పరమాత్మా
ఓ సభాధిపతీ !
మేము అమరారామా
పూర్ణకుంభాభిషేక పనిమంతులం
ఆదిమ నాగజాతి వంశీయుల
వారసులం శాంతికాముకులం
మా కడుపుమీద కొట్టకు రామా
మావి గొంతాలమ్మ కోరికలు కాదే
ఆకివీ'(కీ)డు మనకొద్దు
గరగపర్రు గాయం మానలేదు మారాజా
ఓ ! చంద్రసేనాధిపతీ
మనమంతా బంధువులం
ఈ పిలుపు నిజమేగదా ఆమాత్యా
మంగళ కైశికి రాగ
మాలపించడమే తప్ప
బోధించి సమీకరించి
పోరాడడానికి మెమెంత
‘హర్ష’తిరేక ‘శ్రావణా:నందకరాలే తప్ప
మాకంత శక్తి లేదనే కదా మీ ధీమా
ఎంతమాట అయ్యవార్లూ
మీముందు మేమెంతటివారం
అసమానతలు లేని
కొత్తలోకం కొత్త ఆకాశం
కోసం ఎదురుచూస్తున్న వాళ్ళం
దయచూపండి దారినివ్వండి
సమసమాజ నిర్మాణం కోసం…
-వెంకటేశ్వరరావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
మనమంతా బంధువులం…నిజమేకదా ! (కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>