మాతృభాషా ప్రియులారా(కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి
అయ్యలారా!
తెలుగుజాతి బిడ్డలారా!!
మాతృభాషా ప్రియులారా
ఘనతవహించిన పెద్దలారా
బహుభాషాకోవిధులరా
తెలివెన్నెల వెలుగులో
గోదారి గట్టుపై
మారే కాలానికి మార్గదర్శి లా ఉంటాననుకున్నా కానీ
‘నిత్య గాయాల నెలవంక’లా
మారింది నా తెలుగు
నా ‘నెత్తి మీది యినుప గమేళం’లా
ఆంగ్లమాధ్యమాన్ని
అందలమెక్కిస్తూఉంటే
ఆదికవితగా అందరినోటా
జీవనదిలా అలరారే నేను
మండు వేసవిలో ముడుచుకున్న
గోదారిలా మార్చారు నన్ను
నా కలల రాజ్యానికి
స్వప్నదేశ వసంతానివి నువ్వు
అలల తాకిడికిలో
మెరిసే ముత్యపు చిప్పవి
నువ్వో రత్నానివని పరదేశీయులు
వేనోళ్లా కొనియాడుతుంటే
కృష్ణమ్మలా ఉప్పొంగిపోయా
జలతరంగిణిలా ఉర్రూతలూగిపోయా
కానీ ఈ నవతరం
‘సుందర్ తెలుంగ’ని
పొగడబడిన చోట
ఐ డోంట్ నో టెల్గు అంటుంటే
నా గొంతు పిడసకట్టుకుపోతుంది
ఓ అభినవ దేశోద్ధారకులారా
దయామయులరా
భాషోద్ధారణకు
ఊపిరిలూదండయా
మాతృభాషా పరిరక్షణకు
ముందుకురండయా…
-వెంకటేశ్వరరావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
మాతృభాషా ప్రియులారా(కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>