“లేబర్ లెక్కలు…”(కవిత) -బాలాజీ పోతుల

నీ కట్టుకథలన్నీ కాకులకు చెబితే బాగుండేదేమో..
కనీసం అవైనా నిన్ను నమ్మి మోసపోయేవి కావచ్చు
లేబర్ లెక్కలు వేసేవాడు వాడు
లెక్కల లెక్కలు వాడికేం తెలుసు
శ్రమకి విలువ కట్టడం
నాకూ నీకూ కాదు
వాడికీ తెలియాలి
నంగనాచి ముచ్చట్లు వెనకాడి
దొంగ నాటకాలన్నీ
కళ్ళ ముందు చూపుతుంటే
ఆ నటనకు చప్పట్లే కాని
కంటి రెప్పనైనా ఆడించ బుద్ధేయదు
అది మామూలు నటన కాదు
ఎన్నో ఏళ్లుగా ఆరి తేరుతున్న నటన
అందులో నువ్వూ నేనూ పోషించేది
ఒట్టి ప్రేక్షక పాత్రే!
ఇక్కడ ప్రేక్షకుడంటే వాళ్లకి బానిస
సాటి మనిషంటేనే వాళ్లకి లోకువ
విలువల వలువలు విప్పదీసుకుని
వాళ్లెప్పుడో అక్రమానికి పాల్పడిపోయారు
బయట వారి సంబంధానికి పేరు సున్న
లోపల మాత్రం
ఎంత కడుగుదామన్నా
వారిందంతా అక్రమం అక్రమం అక్రమం
ఇప్పుడిప్పుడే నాక్కూడా తెలిసొస్తుంది
ఒక్కసారి నమ్మి మోసపోయాక
మళ్లీ మళ్లీ వాళ్ళనే నమ్ముతూండటం
నాలో గూడుకట్టుకున్న బలహీనతనిపిస్తోంది
ఎంతెంతగా నమ్మొద్దని
నన్ను నే బతిమాలుకున్నా
నమ్మకుండా ఉండిపోయే
బలాన్నైనా కూడగట్టుకోవాలనిపిస్తోంది
ఎందుకంటే
నమ్మకం మనిషిని కృంగతీస్తుంది
నట్టేటా ముంచిపోతుంది
-బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
“లేబర్ లెక్కలు…”(కవిత) -బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>