జ్ఞాపకం – 101 – అంగులూరి అంజనీదేవి
ఆమె కాదన్నట్లు తలవూపింది.
“మరింకేంటి? ఆడవాళ్లు ఇలాంటి పనులు చెయ్యకూడదేమోనన్న సందేహమా? లేక చెయ్యలేనేమో నన్న భయమా?” అన్నాడు.
ఆమె తలెత్తి మాష్టారి వైపు చూడలేదు.
“అలా ఆలోచించకమ్మా! ఇప్పుడు అలాంటి అనుమానాలేం లేవు. పరిస్థితుల వల్ల చాలా మార్పులు వస్తున్నాయి. నువ్వు తలచుకుంటే ఏదైనా చెయ్యగలవు” అన్నాడు.
సంలేఖ మాట్లాడలేదు.
“చూడమ్మా! ఇప్పుడు కొన్నిచోట్ల కొడుకులు లేనివాళ్లు ఏంచేస్తున్నారో తెలుసా! ఉన్న ఆస్తిని కర్మలు చేసినవాళ్లకి ఇస్తే తమ ఆడపిల్లలు ఎలా బ్రతుకుతారని భయపడి తల్లిదండ్రులు చనిపోయాక ఆడపిల్లల చేతనే కుండపట్టిస్తున్నారు, కర్మలు చేయిస్తున్నారు. పెద్దనాన్న కొడుకుల చేత, చిన్నాన్న కొడుకుల చేత చేయించటం లేదు. ఒకవేళ చేయించినా ఆస్తులు ఇవ్వకపోతే పగలు, కక్షలు, తరతరాలుగా సాధించటం జరుగుతుందట. మరి అలాంటి పనులనే ఆడపిల్లల చేత చేయిస్తున్నప్పుడు ఇది నువ్వు డబ్బులిచ్చి ఎక్కడో వుండి కట్టిస్తే తప్పేంటి? ఎలా ఆలోచించినా నాకయితే తప్పనిపించటం లేదు. డబ్బులిస్తే మేస్త్రీలు వచ్చి క్షణాల్లో కట్టేస్తారు. తరతరాలు గుర్తుండిపోతుంది. ఇప్పుడు నువ్వు రాస్తున్న రచనలు ఎలా నిలబడిపోతాయో నువ్వు నీ తండ్రికి కట్టించబోయే సమాధి కూడా అలాగే నిలబడిపోతుంది. ఏమంటావ్?” అడిగాడు భరద్వాజ మాష్టారు.
ఆమె మౌనంగానే వుంది. ఆమె మౌనం మాష్టారికి నచ్చలేదు.
“ఇంత చెప్పినా మాట్లాడవేం లేఖా! నువ్వు నీ తండ్రికి ఆమాత్రం కట్టించలేవా? ఆయన నీకోసం ఎన్ని చెయ్యలేదు. నీమీద ఎంత పెట్టలేదు. ఈరోజు నువ్విలా రాస్తున్నావంటే మీనాన్న నిన్ను చదివించిన చదువు వల్లనేగా! ఎన్నో ఇబ్బందులు పడి నీకు పెళ్లి చెయ్యకపోతే నువ్వు జయంత్ కి భార్య అయ్యేదానివా?” అన్నాడు.
సంలేఖ తలవంచుకునే వుంది.
“చూడు లేఖా! మీ నాన్నగారు దివ్యత్వంలో జీవించి లోకానికి హితవు చేసిన ఒక రమణమహర్షి, ఒక రామకృష్ణుడు, ఒక అరవిందుడు, ఒక వివేకానందుడు కాకపోవచ్చు. కుటుంబంకోసం, పిల్లలకోసం చాలా చేశాడు. మీరే లోకంగా జీవించాడు. మీ నాన్నలాంటి తండ్రులు అరుదు. నేనయితే చెప్పాను. తర్వాత నీ ఇష్టం!” అన్నాడు.
దెబ్బతిన్నట్లు చూసి “మాష్టారూ!” అంది.
“మాష్టారినే మాట్లాడుతున్నానమ్మా! ఇప్పుడు మీనాన్నగారు లేరు. మరి బ్రతికివున్న నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావ్ చెప్పు?”
“అలా మాట్లాడకండి మాష్టారూ!”
“అదికాదు లేఖా! చనిపోయిన వాళ్లకోసం పిల్లలు చెయ్యగలిగిన పనులు ఏముంటాయి చెప్పు? ఇలాంటివేగా!” అన్నాడు నెమ్మదిగా.
“నిజమే మాష్టారు!” అంటూ ఒప్పుకుంది సంలేఖ.
“మరి మీనాన్న గారికి నేను చెప్పినట్లు నువ్వు కట్టిస్తావా?”
“నా కుటుంబ నేపథ్యం మీకు తెలియదు మాష్టారూ! ఈ పనికి వాళ్లు ఒప్పుకోరు”
“ఏం? ఎందుకని? జయంత్ మంచివాడేగా!” అన్నాడు.
మళ్లీ మాట్లాడలేదామె.
“చెప్పమ్మా! జయంత్ ఎలాంటి వాడు? నిన్ను బాగా చూసుకుంటున్నాడా?” సందేహంగా చూస్తూ అడిగాడు.
“పర్వాలేదు మాష్టారు! కానీ మా అత్తగారు, మామగారు ఇలాంటి పనులు చేస్తానంటే డబ్బులివ్వరు”
“జయంత్ వున్నాడుగా! అతనితో చెప్పు!”
“ఆయన ఆలోచనలు, అభిరుచులు, లక్ష్యాలు చాలా డిఫరెంట్ మాష్టారూ! లేటెస్ట్ కారు కొనాలంటారు. ఇంటికి ఎప్పుడూ లేటెస్ట్ డెకరేషన్ చేయించాలంటారు. ఎందులోనైనా పక్కవాళ్లకన్నా తనే అధికుడుగా వుండాలంటాడు. ఇలాంటివి చెప్పినా ఎగతాళి చేస్తాడు. నవ్వుతాడు. ఆయన తత్వం నాకు తెలుసు” అంది.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం – 101 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>