జ్ఞాపకం – 102 – అంగులూరి అంజనీదేవి
“సరే! లేఖా! ఈ పని ఎవరు చేసినా పుణ్యమే అని నీకు చెప్పాను. నువ్వూ ఒక ఇంటి కోడలివి కాబట్టి ఇలాంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం కష్టంగానే వుంటుంది. అయినా ఈరోజుల్లో కొడుకులే కట్టించడం లేదు. ఆడపిల్లవి నువ్వేం కట్టిస్తావ్ లే. ఏదో మన తృప్తికోసం ఇంతసేపు మాట్లాడుకున్నాం” అన్నాడు.
“మీ మాటలు వృధా గా పోవు మాష్టారూ! అవి నాకు ఇన్సిపిరేషన్! ఆ మధ్యన పేపర్లో ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన చలం గారి సమాధి ఫోటో చూశాను. ఆరోజే నాకు మా నాన్నగారి సమాధిని అన్నయ్యలతో కట్టించాలన్న సంకల్పం కలిగింది. అందుకే వచ్చి వాళ్లను అడిగాను. వాళ్లు వీలుకాదన్నారు. ఇక నా ప్రయత్నం నేను చేస్తాను” అంది.
“సరేనమ్మా! భీజమైతే పడింది. అది మొలకెత్తాలంటే అనువైన పరిస్థితులు కావాలిగా!” అంటూ లేచి వెళ్లిపోయాడు.
భరద్వాజ మాష్టారితో మాట్లాడాక సంలేఖ ఆలోచనలకి ఒక ఆకృతి ఏర్పడింది.
వెంటనే దిలీప్ కి ఫోన్ చేసి “దిలీప్! మీతో కొంచెం మాట్లాడాలి” అంది.
”విత్ ప్లెజర్! మాట్లాడండి” అన్నాడు దిలీవ్.
ఎలా మొదలు పెట్టాలో అర్థంకాక ఆలోచిస్తోంది సంలేఖ.
ఆమె వెంటనే మాట్లాడకపోవడం తో డౌటొచ్చి “ఎక్కడున్నారు?” అని అడిగాడు దిలీప్.
“ఆదిపురిలో వున్నాను దిలీప్!”
“అదేం ?”
“ఏంలేదు”
“మొన్న నేనూ, జయంత్ ట్రైన్ లో కలిశాం లేఖా! మీరు ఆదిపురిలో వున్నట్లు చెప్పనేలేదు”
“మరచిపోయి వుంటారు”
దిలీప్ నవ్వి “మిమ్మల్నా? ఆదిపురినా?” అడిగాడు.
“రెండూ” అని అందామని ఆగిపోయింది.
“మీకో విషయం చెప్పనా లేఖగారు?”
“చెప్పండి దిలీప్!”
“మొన్న ట్రైన్ లో కలిసినప్పుడు జయంత్ చాలా మూడీగా అన్పించాడు. ముందు అర్థం కాలేదు. సడన్ గా ‘మీరు సంలేఖగారి నవలలు చదివారా?’ అని మా ముందు కూర్చుని ప్రయాణిస్తున్నవాళ్లని అడిగాడు. వాళ్లు మాకు నవలలు చదివే అలవాటు లేదన్నారు. చేతులు చాపి ‘యాహూ’ అని అరిచినంతపని చేశాడు. నేను స్టన్నయ్యాను. వెంటనే పక్కన కూర్చుని వున్న అమ్మాయి తన చేతిలో వున్న నీ నవలను చూపించి ‘సంలేఖ గారి నవలలు నేను చదువుతాను. మీరుకూడా ఆవిడ అభిమానా?’ అని అడిగింది. ‘అభిమానిని కాను. ఆవిడ భర్తని’ అని చెప్పలేదు. ముఖం మాడ్చుకున్నాడు. అహం దెబ్బతిన్నట్లు ఫీలయ్యాడు” అన్నాడు దిలీప్.
సంలేఖ వింటోంది.
“నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అతనెందుకలా మారిపోయాడో! ఒకప్పుడు నీ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లను గుండెలకి హత్తుకునేవాడు. ఇప్పుడు కొట్టినా కొట్టేలా వున్నాడు. అతను ఇలాగే వుంటే రానురాను చాలా మారిపోతాడేమోననిపించింది” అన్నాడు.
అతని మాటలు వింటుంటే సంలేఖకి బాధగా వుంది.
“మీ విలువను, పాఠకులు మీకిచ్చే ప్రాధాన్యతను అతనెందుకో తట్టుకోలేకపోతున్నాడు. డిగ్రీలు తెచ్చుకోటానికి విద్యాలయాలుంటాయి. పరిమిత కాలం వుంటుంది. ఒక రైటర్ కి పరిమిత కాలం వుండదు. ప్రభోదించే విద్యాలయాలుండవు. ప్రముఖంగా గుర్తించబడటానికి ఒక జీవితకాలం కష్టపడతారు. అలాంటి ఉన్నత విలువలను కలిగిన మీకు భర్తగా జయంత్ కరెక్ట్ కాదేమో అన్పిస్తోంది. ఒకప్పుడు మౌనంగా వున్న మిమ్మల్ని కదిలించి, మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి జయంత్ తో మీ పెళ్లి జరిగేలా చేసి నేను తప్పు చేశానేమో అన్పిస్తోంది. సమస్య చిన్నదా పెద్దదా అని కాదు. దాన్ని దగ్గరుండి ఎదుర్కోవాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. అందుకే ఫీలవుతున్నాను” అన్నాడు.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం – 102 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>