జ్ఞాపకం – 103 – అంగులూరి అంజనీదేవి
సంలేఖ బాధ ఇంకా పెరిగింది. ఆమె దాన్ని దిగమింగి ఏదో మాట్లాడబోయేలోపలే దిలీప్ మాట్లాడాడు.
“లేఖగారు! మనం ప్రేమించినవాళ్లకంటే మనల్ని ప్రేమించినవాళ్ల దగ్గర మన జీవితం బావుంటుందంటారు. అది ఎంతవరకు సరియైనదో నాకు తెలియదు. కానీ మీకు జయంత్ అంటే ప్రాణం. అతన్ని మీరు భరిస్తారు. ఆ నమ్మకం నాకుంది. కానీ మీకూ ఫీలింగ్స్, ఎమోషన్స్ వుంటాయి కదా! నా భర్త ఇలా వుండాలి, నన్ను ఎంకరేజ్ చెయ్యాలి. మంచి వాతావరణాన్ని కల్పించాలి. నా ఎచీవ్ మెంట్స్ ని మెచ్చుకోవాలి. నన్ను ప్రేమగా చూసుకోవాలి. అసలా ప్రేమకోసమే కదా ఒక విద్యార్థి అత్యంత ముఖ్యమైనదిగా భావించే చదువును సైతం డిస్టర్బ్ చేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు బాధగా వుంది” అన్నాడు.
“థాంక్యూ దిలీప్! కానీ ఇప్పుడు నాకు అలాంటి బాధలేం లేవు. మన అంతరంగం అందంగా వుంటే జీవితం ఆనందంగా వుంటుందని తెలుసుకోలేని జయంత్ గురించి ఆలోచించేంత ఖాళీ సమయం కూడా నాకు లేదు” అంది.
“ఓ.. సారీ! ఏదో మాట్లాడాలని కాల్ చేశారు. మాట్లాడండి!” అన్నాడు. కదిలించగానే కందిరీగల్లా ముసురుకున్న జయంత్ ఆలోచనల నుండి వెంటనే బయటపడ్డాడు దిలీప్.
“దిలీప్! మీరు పుట్టినప్పటి నుండి మీ తండ్రి మిమ్మల్ని ఎలా చూసుకున్నాడో, ఆయన వల్ల మీరెంత సఫరయ్యారో నాకు కొంత తెలుసు. అయినా మీ తండ్రి అంటే మీకు ఇష్టం, ప్రేమ, దయ, ఇప్పటిక్కూడా ఆయన చేసే పనులు మీకు నచ్చకపోయినా ఆయన్ని ఇంట్లో వుంచుకున్నారు. ప్రేమిస్తున్నారు. ఎందుకు? ‘ఆయన మీ తండ్రి’ అని మీ అమ్మగారు మీకు ఊహ తెలిసినప్పటి నుండి పరిచయం చేశారు కాబట్టేకదా. దీన్నిబట్టి చూస్తే మీ కళ్లకి మీ తండ్రిలో వుండే జూదం అనే వ్యసనం కన్పిస్తున్నా అది మీ మెదడుకు
చేరటం లేదు. ఆయన్ని ఎవాయిడ్ చెయ్యాలని అనిపించటం లేదు. ఎందుకు? తండ్రి అన్న ఒకే ఒక్క అనుభూతి. దానికి మీరిచ్చే విలువ. అందుకే దిలీప్ మీరంటే నాకు గౌరవం. ఇలాంటి గౌరవాన్ని ఎంతమంది కొడుకులు పొందుతున్నారు? మనం పొందే అన్ని రకాల గౌరవాల కన్నా ఈ గౌరవం చాలా గొప్పది కదా?” అంది.
సంలేఖ మాటలు హాయిగా అన్పించాయి దిలీప్ కి. తన ఊరివాళ్లు ఎప్పుడు కన్పించినా “ఆకలైనప్పుడు అన్నం పెట్టని వెదవ నీ తండ్రి. ఆయన సంపాదన మొత్తం ఆయన వ్యసనానికే తగలబెట్టేసాడు. ఆయన నీకేం చేశాడని ఆయన్ని తీసికెళ్లి ఇంట్లో వుంచుకున్నావ్? అదే మేమైతేనా తండ్రి అని కూడా చూడకుండా నరికి పోగులు పెట్టేవాళ్లం. నా తండ్రి అని నలుగురికి చెప్పుకునేవాళ్లం కూడా కాదు. నీ తల్లిమాత్రం నీ తండ్రి దగ్గర ఏం సుఖపడింది? హోటల్లో గిన్నెలు తోమి అక్కడ మిగిలిన అన్నం, కూరలు తెచ్చి నీకు పెట్టుకునేది. ఏది ఏమైనా నువ్వు కాబట్టి నీ తండ్రిని భరిస్తున్నావ్! ఇప్పటిక్కూడా ఆయన ఆ వ్యసనాన్ని మరచి పోలేదని బయట అనుకుంటున్నారు” అని ఛీ కొడుతుంటారు. అలాంటప్పుడు కలిగే మనోవ్యధ మహా భయంకరంగా వుండేది.
దిలీప్ మౌనంగా వుండటం చూసి “మీ నాన్నగారికి ఆరోగ్యం బావుండటం లేదని హస్విత చెప్పింది. ఇప్పుడెలా వుంది దిలీప్?” అడిగింది సంలేఖ.
“ఓ.కె. హి ఈజ్ ఆల్ రైట్!” అన్నాడు దిలీప్.
“మీరీమధ్యన మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో చేర్పించి లక్షరూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్ మెంట్ ఇప్పించినట్లు హస్విత చెప్పింది. ఇది నాకు నచ్చింది దిలీప్! ఎందుకంటే మీలో వుండే దయ, మానవత్వం ఒక తండ్రిని కాపాడింది. ఈ తండ్రి నాకేమిచ్చాడన్న వ్యాపార దృక్పథం లేదు మీలో… చివరిరోజుల్లో కొడుకులచేత నిర్దాక్షిణ్యంగా రైల్వేస్టేషన్లోనో, స్మశానం పక్కనో వదలబడుతున్న తల్లిదండ్రులు మీలాంటి కొడుకుల్ని చూస్తే ఏమంటారో తెలుసా దిలీప్! దేశానికి కాని, సమాజానికి కాని, తల్లి, దండ్రులకి కాని మీలాంటి కొడుకే అవసరం అంటారు. కన్నవాళ్లెప్పుడూ పిల్లల్ని చూసి సిగ్గు పడకూడదు దిలీప్! గర్వపడాలి.మనకోసం మన పిల్లలు ఇలా కూడా చెయ్యగలరా అని ఆనందపడాలి. అందుకే నాకు మా నాన్నగారికి సమాధి కట్టించాలని వుంది” అంటూ తన మనసులో మాటను దిలీప్ తో చెప్పింది. .
ఆఖర్లో సంలేఖ అన్న మాటలు అద్భుతంగా నచ్చాయి దిలీప్.
“వండర్ ఫుల్ ఐడియా లేఖగారు! మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చెయ్యాలో తెలియడం లేదు” అన్నాడు.
“థాంక్యూ దిలీప్! కానీ నా దగ్గర డబ్బులేదు” అంది.
“ఎంత కావాలో చెప్పండి! నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే మీరు చేస్తున్నది మంచిపని. మంచి ఆలోచన. తల్లి,దండ్రులు చనిపోయాక కొందరు పిల్లలు ప్రేమాభిమానాలతో వాళ్ల తల్లిదండ్రుల పేరుతో అన్నదానాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు. దానధర్మాలు చేస్తుంటారు. కానీ ఇలాంటివి అరుదుగా చేస్తారు” అన్నాడు.
(ఇంకా ఉంది )
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం – 103 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>