జ్ఞాపకం – 109 – అంగులూరి అంజనీదేవి

అందుకే నేను మా అమ్మా, నాన్నలను, నా చెల్లిని, తమ్ముడిని పరాయివాళ్లలా చూశాను. ఉద్యోగం చేస్తూ కూడా వాళ్లకి డబ్బులివ్వలేదు. వాళ్లకి డబ్బులిస్తే తిరిగి ఇస్తారా? వడ్డీ వస్తుందా రాదా? అన్న నీచమైన ఆలోచనలను చేశాను. ఈ ఆలోచనలు నాకు నీద్వారా వచ్చినవే. నువ్వెలా చెబితే అలా వినేవాడిని. నాకు ఉద్యోగం వచ్చిందీ అంటే మా నాన్న నన్ను చదివించటం వల్లనే. దానికోసం ఆయన అప్పులు చేశాడు. అవి తీర్చుకుంటూ తిలక్ ని నిర్లక్ష్యం చేశాడు. అది ఆయన కావాలని చేసింది కాదు. ఆయన శక్తి నాతోనే ఆగిపోయింది. అలాంటప్పుడు నేను తిలక్ ని చూడాలా? వద్దా? నా చెల్లెలి బాధ్యత నాకు వుందా? లేదా? ఇలాంటి కుటుంబంలోకి కోడలిగా వస్తున్నప్పుడు నీలాంటి వాళ్లు ఇవన్నీ ఆలోచించాలి. అది మానేసి నన్నే నీ గుప్పెట్లో పెట్టుకున్నావ్! నేను కూడా చాలా ఈజీగా మారిపోయాను. నేనే కాదు. భార్య చెప్పే ప్రతిమాటా వేదం అనుకునేవాళ్లు ఈ భూమ్మీద చాలామంది మగవాళ్లే వున్నారు.
వాళ్లందరి మాట ఏమో కాని నాకు మాత్రం ఈ భూమ్మీద నడిచే అర్హత లేదనే నాకు ఆ యాక్సిడెంట్ అయింది. ఎంతో క్షోభను అనుభవించాను. ఇక ఎప్పటికీ అలాగే మంచంలో వుంటాననుకున్న నాకు తిరిగి కాల్లొచ్చాయి. అందరిలాగా నడుస్తానో లేదో అనుకున్న నేను ఇప్పుడు నడుస్తున్నాను.
నడక పొయ్యాక, నడక వచ్చాక వున్న తేడాను తెలుసుకున్నాను. నేను స్వతహాగా మంచివాడినే! అందుకే మంచిపనులు చెయ్యాలనుకున్నాను. మంచి పనులు అంటే నేను ఈ భూమ్మీద అడుగుపెట్టిన ప్రతిసారీ ఈ నేల నా పాదాలను చూసి గర్వపడాలి. నా పాదాలకి తన అమృత స్పర్శను అందిస్తూ కాపాడాలి. నేను నడవలేనప్పుడు ప్రతిరోజు మంచంలో పడుకొని ఈ నేలను చూసి ఏడ్చేవాడిని. నేలమీద అడుగు పెట్టి పది అడుగులైనా వేస్తానో లేదో అని భాధపడేవాడిని. నేలకూ నాకు ఋణం తీరిపోయిందేమో అని విలపించేవాడిని. అందుకే ఆ బాధ తెలుసు నాకు. నడవలేనివాళ్లు లోలోన ఎంత ఘర్షిస్తారో తెలుసు. అందుకే ఈ పని చేశాను. సంలేఖ నన్ను ‘నాన్నకి సమాధి కట్టించు అన్నయ్యా!‘ అని అడిగినప్పుడు నేను ‘నో‘ అన్నాను. నిజానికి నాకు మా నాన్నకన్నా ఏదీ ఎక్కువ కాదు. అయినా ఎందుకు ‘నో‘ అన్నానంటే నావైపు నుండి నేను ఏ పని చేసినా మా నాన్నకి సంతోషం కలిగించేదై వుండాలి. ఇప్పుడు మా నాన్నగారి ఆత్మ నేను చేసిన పనికి నిజంగానే నర్తిస్తుంది. ఆనందతాండవం చేస్తుంది. అంతేకాదు అనాదలైన వికలాంగుల కోసం నేను చేసిన ఆర్ధిక సహాయం నా జన్మకో అర్థాన్నిస్తుంది. మనో నిబ్బరాన్ని ఇస్తుంది. ఇప్పటి నుండి నేను బ్రతికేది వికలాంగుల కోసమే!” అన్నాడు.
“నాకోసం కాదా?” అంది బలవంతంగా గొంతు పెగుల్చుకొని.
అతను కిటికీ దగ్గరే నిలబడి నవ్వాడు. ఆమెవైపు చూడలేదు. బయటకే చూస్తూ “ఇలాంటి మాటలు, పెళ్లినాటి ప్రమాణాలు వినటానికి సొంపుగా అన్పిస్తాయి. అవి నిజంగా నిజమైతే నాకు కాళ్లు లేనప్పుడు ఒంటరివాడినెందుకయ్యాను. అందుకే నాకోసం, నీకోసం అనే పదాలను పక్కన పెట్టి మనకోసం మనం బ్రతుకుదాం! ఎవరు ఎవరికోసం బ్రతకనవసరం లేదు. అయినా నీకు నేనేం తక్కువ చేస్తున్నాను. తిండీ, నీడ, బట్టలు, రక్షణ అన్నీ ఇస్తున్నానుగా” అన్నాడు.
బోరున ఏడ్చింది వినీల.
“అరే! ఎందుకేడుస్తున్నావ్? అమ్మ రెండు గాజులు కూడా నీకే! పాపం! సంలేఖ నరాలు తెగేలా నవలలు రాసి సంపాయించి మా నాన్నకి సమాధి కట్టించింది. మొన్న మనపక్క ఊరతను కన్పించి ‘మీ చెల్లెలు మీ ఇంటి పేరును దారినపోయే వాళ్లందరికీ తెలిసేలా చేసిందయ్యా రాజయ్యా!‘ అన్నాడు. నువ్వు ఏడవకు. నీకు ఏ విధంగా చూసినా పైసా లాస్ రాదు. పైసామే పరమాత్మ” అన్నాడు చేతులు రెండూ గాల్లోకి లేపుతూ.
వినీల ఏడుపు ఆపి ఒక్క ఉదుటున లేచి వెళ్లి రాజారాం కాళ్లను చుట్టేసింది..
రాజారాం కిందకి చూసి “ఏంటే! కాళ్లు చుట్టుకున్నావ్! లాగి పడేస్తావా నన్నూ?” అన్నాడు.
“కాదండీ! నన్ను క్షమించండి!” అంది.
ఆశ్చర్యం కన్నా ఆనందమే ఎక్కువ కలిగింది రాజారాంకి. ఆమెను రెండు చేతులతో ప్రేమగా లేపాడు.
*******
శ్రీలతమ్మకు ఉన్నట్టుండి బి.పి. పూర్తిగా డౌనయింది. లేస్తే కళ్లు తిరుగుతున్నాయి. బలవంతంగా లేచి తిరిగి మూడుసార్లు కిందపడింది. లేచి తిరగలేక, తిరగకపోతే చేసి పెట్టే వాళ్లు లేక రెండు రోజులు ఇబ్బంది పడింది. మూడోరోజు రజితను పిలిపించుకుంది.
రజిత వచ్చిన రోజు తల్లినే కనిపెట్టుకొని “మమ్మీ ఏంకావాలి? అది కావాలా? ఇది కావాలా?” అంటూ అడిగి మరీ చేసి పెట్టింది. రెండు రోజులు గడి చాక “నాకు మా ఆయన గుర్తొస్తున్నాడు. ఆయన్ని చూడకుండా ఎన్నిరోజులుండాలి?” అంది.
శ్రీలతమ్మ నివ్వెరపోయి “ఇంతకుముందు ఎప్పుడొచ్చినా నెలలు నెలలు వుండే దానివిగా. ఇప్పుడు నువ్వుండకపోతే నాకు, డాడీకి అన్నయ్యకు ఎవరొండి పెడతారు? పనిమనిషి కూడా నేను తిరగలేనని తెలిసి కేకలేసి మొత్తుకున్నా నా మాట సరిగా వినటం లేదు. వుండవే! వెళ్తువుగాని” అంటూ బ్రతిమాలింది.
-– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
జ్ఞాపకం – 109 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>