జ్ఞాపకం 91 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
“ఇంటికెళ్తాను. ఈ మధ్యన పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం నాకు నచ్చటంలేదు. ఎదుటివాళ్లకి కీడు జరగాలని మనసులో అనుకోవటం కూడా హింసేనట” అంటూ వెళ్లిపోయింది.
వెంటనే ఇంకో అమ్మాయి రజిత భుజం మీద చెయ్యివేసి “నువ్వేం నిరుత్సాహపడకు. నేనున్నాను కదా! మీ వదినతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మా ఇంటి పక్కన ఒక ఓల్డ్ రైటర్ వున్నాడు. ఆయనకు రాయాలని వుంటుంది. ఒంట్లో ఓపికలేక రాయలేడు. రాసేవాళ్లను ఎలాగైనా వెనక్కి లాగాలని చూస్తుంటాడు. నేను ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే వుంటాను. నాకు రైటర్స్ ఎలా మాట్లాడుకుంటారో తెలుసు. కావాలంటే వాళ్ళ బాషలోనే మాట్లాడి మీ వదినను హర్ట్ చేస్తాను. నీ కోరిక తీరుస్తాను. ఓకే నా?” అంది.
‘’ఓకే..” అంది రజిత. రజిత కళ్లు ఆనందంతో మెరిశాయి.
వదినకి వచ్చే కీర్తిని చూసి ఓర్చుకోవాలంటే చాలా కష్టంగా వుంది. ఆమెను ఎలాగైనా కుంగదియ్యాలి. దానికి ఇదే మంచి సమయం. వేడిమీద వున్నప్పుడే ఇనుమును నలగొట్టినట్లు మనిషిని బాధలో వున్నప్పుడే బాధ పెట్టాలి. లేకుంటే ఏ మనిషినైనా అంత సులభంగా బాధపెట్టలేం అని మనసులో అనుకుంది రజిత.
ఇద్దరు కలిసి హుషారుగా వెళ్లి సంలేఖ వున్న గది తలుపు కొట్టారు.
సంలేఖ తలుపు తీసి “ఓ! మీరా! రండి!” అంటూ లోపలకి ఆహ్వానించి కూర్చోమంది.
వాళ్లిద్దరు ఆమెకి ఎదురుగా కూర్చున్నారు.
“వదినా ఇది నా ఫ్రెండ్! నువ్వు రైటర్ వి అని చెప్పగానే నన్ను వాటేసుకొని, నీ అపాయింట్మెంట్ కావాలంది. ఇదిగో ఇప్పటికి తీరింది దాని కోరిక” అంది రజిత.
“ఓ… అలాగా!” అంటూ ఆ అమ్మాయి వైపు ప్రేమగా చూసింది సంలేఖ. ఆ చూపులు చాలా హాయిగా అన్పించాయి. కానీ వెంటనే తను వచ్చిన పని గుర్తుచేసుకుంది.
“నాకు కొన్ని సందేహాలు వున్నాయి మేడం! వాటిని మీరు క్లారిఫై చెయ్యాలి” అందా అమ్మాయి.
“అడుగమ్మా! ఏం కావాలో!” అంది సంలేఖ.
“ఎప్పుడు చూసినా భేతాళుడు చెట్టుపైనే ఎందుకుంటాడు? అది నాకు తెలుసుకోవాలని వుంది. మీకు తెలుసా?” అడిగిందా అమ్మాయి.
“శాపవశాత్తు భేతాళుడు శవరూపంలో చెట్టుపైనే వుండిపోతాడు” అంది సంలేఖ.
“అంతే తెలుసా మీకు? ఇంకేం తెలియదా? ఎలా చేస్తున్నారండీ రచనలు? మీకు తెలుసో లేదో మా ఇంటి పక్కన ఓ రైటర్ వున్నారు. ఆయన మీలాంటి వాళ్లను ఉద్దేశించే కాబోలు రచనారంగంపై పెద్ద ఆసక్తి చూపరు. ‘ఆ… ఇప్పుడెవర్రాస్తున్నారు అంత గొప్పగా! అంతా చెత్తే!’ అంటుంటారు. చాలాకాలం నుండి ఇంగ్లీషులో తప్ప మన తెలుగులో మంచి నవలలే రావడం లేదని బాధపడుతుంటారు’ అంది రజిత స్నేహితురాలు.
ఆ మాటలకి సంలేఖ బిత్తరపోలేదు. ఆ రైటర్ సంగతి ఆమెకు తెలుసు. ఒక సభలో ఒక రైటర్ ని పొగిడితే ఇంకో సభలో ఆ రైటర్ ని తీసిపడేస్తుంటాడు. ఆయన ఎప్పుడేం స్టేట్మెంట్ ఇస్తుంటారో కూడా గుర్తుండదు. తెలుగులో బాగా రాసేవాళ్లు లేకపోతే ఇన్నిన్ని పత్రికలు, వెబ్ మేగజైన్ లు ఎలా నడుస్తున్నాయి? అని ఆలోచిస్తోంది సంలేఖ
”ఏంటీ ఆలోచిస్తున్నారు? మీకో విషయం తెలుసా?”
”ఏంటా విషయం?”
”మీ రచనలు ప్రపంచస్థాయిలో చెప్పుకోదగినట్లు లేవట. అసలు మీ నవలల్లో సంఘటనలే వుండవట. సన్నివేశాలు కూడా అంతంతమాత్రమేనట. మానవ సంబంధాల పరిణామాల చిత్రణ అసలే వుండదట. సామాజిక పరిణామానికి అనుకూలంగా, వాస్తవానికి దగ్గరగా ఒక్క నవల కూడా మీరు రాయలేదట. అలాంటప్పుడు ఎందుకండీ రాయడం? హాయిగా అత్తగారితో, ఆడపడుచుతో కాలక్షేపం చెయ్యొచ్చుగా!” అంది.
సంలేఖ నవ్వి “నా నవలలు మీరు చదివారా? చదవకుండా వాఖ్యానాలు చెయ్యొచ్చా?” అంది.
“నేనెందుకండీ చదవటం? రచయితలను, సాహిత్య ప్రపంచాన్నీ మా పక్క రైటర్ అనుక్షణం పరిశీలిస్తూనే వుంటాడట. ఎప్పటికప్పుడు ‘రచయితలు ఎలా స్పందిస్తున్నారు? దానివల్ల ఎలాంటి రచనలు వస్తున్నాయి’ అని ప్రశ్నలు వేసుకోవటమే ఆయన పని. మీరేమో ఒక్క భేతాళుని గురించి అడిగినా చెప్పలేకపోతున్నారు” అంది ఎగతాళిగా. రజితకి సంబరంగా వుంది.
సంలేఖకి అప్పుడు అర్థమైంది. రజిత ఏదో కుట్రతోనే తన ఫ్రెండ్ ని వెంటబెట్టుకొని వచ్చిందని.
“చూడమ్మా! నీకు మా సాహితీరంగం పై తెలిసింది కేవలం ఆయన మాటల్లోనే అని నాకు అర్థమైంది. ఆయన్నే కాదు. నువ్వు చాలామందిని కదిలించి చూడు ఇంగ్లీషులో తప్ప తెలుగులో మంచి నవలలు లేవనే అంటారు. అది ఫ్యాషన్ అంతే! దాన్నే ప్రమాణంగా అనుకోవద్దు. ఇక నీ ప్రశ్నకీ సరైన జవాబు నేను చెప్పిందే! కానీ నీకు కావాలసిందేమిటో నీకు అడగటం రాలేదు” అంది సంలేఖ.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం 91 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>