జ్ఞాపకం 93 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
ఉదయాన్నే రెడీ అయి “నేను మా ఆదిపురికి వెళ్తున్నా!” అని భర్తతో చెప్పింది సంలేఖ.
“అమ్మతో చెప్పావా?” అన్నాడే కానీ ‘ఎందుకెళ్తున్నావ్? ఎప్పుడొస్తావ్?’ అని అడగలేదు. ఆమె మనసంతా బరువుగా అయింది.
“అత్తయ్యతో చెప్పాను. వెళ్లమంది” అంది.
“అంతేనా! ఇంకేమైనా అన్నదా?” అడిగాడు.
“మీ రాజారాం అన్నయ్య జాబ్ కి వెళ్తున్నాడుకదా! సామాన్ల డబ్బులు అడిగి తీసుకురా! మరచిపోకు అంది. అవి తీసుకురాకుండా రాకు అని కూడా అంది” అంది సంలేఖ.
జయంత్ మాట్లాడలేదు. జయంత్ మాటకోసం అక్కడే నిలబడింది సంలేఖ. అతను సీరియస్ గా చూస్తూ “సరే! వెళ్లు! చెప్పిందిగా!” అన్నాడు.
దుఃఖం పొంగుకొచ్చింది సంలేఖకి. అయినా ఆపుకుంది. ఎప్పుడూ ఏడవటమే జీవితం కాదు. జీవితానికి అర్థం పరమార్థం వుంటుందంటారు. ఏడుస్తూ కూర్చుంటే ఏ అర్థమూ వుండదు. తనవి కొన్ని డ్రస్‌లు, పుస్తకాలు వున్న బ్యాగ్ ని పట్టుకొని గేటు దాటి రోడ్డుమీదకి వచ్చింది.
డబ్బే సర్వస్వం అనుకునేవాళ్లకు చెప్పేవాళ్లు వుండరు. బంధువులు వుండరు. వాళ్లనెవరూ మార్చలేరు. ఎవరినీ ఏమీ కోరకపోవడమే గౌరవం. అదే సౌఖ్యం, అదే కీర్తి, అదే సౌభాగ్యం. కానీ తన అత్తగారిలో, జయంత్ లో వుండే ఆశ పర్వతం కన్నా, సముద్రంకన్నా, ఆకాశం కన్నా, బ్రహ్మపదార్థం కన్నా పెద్దది. అన్నం, నీరు, మంచి మాటలు ఇవే మనిషికి కావలసినవి. ఈ మూర్ఖులెప్పుడూ ప్రేమాభిమానాలకోసం చూడరు. డబ్బుకోసమే చూస్తారు. ఆ డబ్బు పెరుగుతూనే వుంటుందట ఆడపిల్లలా మరొకడికోసం. ఇలాంటి ధనాందులకు ధర్మము, కీర్తి మాత్రమే స్థిరమని ఎప్పటికి తెలియాలి?
ఆటో ఆపి కూర్చుంది సంలేఖ. ఆమెకు తన భర్త జయంత్, అతనితో తను గడిపిన జీవితమే గుర్తొస్తోంది. జీవితమంటే ఒక్కక్షణం కాదు. ఒక్క నిమిషం కాదు. ఒక్క గంట కాదు. ఒక్క రోజు కాదు. ఎన్నో రోజులతో, నెలలతో, సంవత్సరాలతో కూడుకున్నది. అలాంటి జీవితాన్ని ఆనందంగా గడపలేదు. ప్రతి క్షణం అసూయతో రగిలిపోతూ నేనే అధికుడ్ని, నన్ను మించి ఎవరూ వుండకూడదనుకునే భర్తతో గడిపింది. అదికూడా ఒక ప్రత్యర్థితో గడిపినట్లు. జీవితం ఇలాగే వుంటుందా?
అటో దిగింది సంలేఖ. అతనికి డబ్బులిచ్చి, రైల్వే స్టేషన్ వైపు వెళ్లింది.
జయంత్ కి వాళ్ల చెల్లెలు తనమీద ఏ అబద్దం చెప్పినా దాన్ని అతను మనసులో దాచుకోడు. ఆమెను ఏమీ అనడు. సూటిగా, ఆవేశంగా తన వైపే చూస్తాడు.
“చూడు లేఖా! నీకు ఎన్నోసార్లు చెప్పాను. రజిత జోలికి వెళ్లొద్దని. అయినా నామాట వినవు. మనం ఒకచోటుకి వెళ్లి వుంటున్నప్పుడు అక్కడ ఎవరితో ఎలా వుండాలో ఆమాత్రం తెలియదా నీకు?” అంటాడు. అతను అలా ఎందుకంటాడో తెలియదు. భార్య అంటే అతనిదృష్టిలో ఏమిటో తెలియదు. తనకి తెలిసింది ఒక్కటే. తనది ఆ ఇంట్లో ఒక అతిధి పాత్ర. అతను ఆ భావంతోనే చూస్తున్నాడు. ఈ గెస్ట్ పాత్రని తను ఎన్నిరోజులు నిర్వహించాలో ఏమో. ప్రతి మనిషి ప్రాప్తం అనే మాటను ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా ఈ జీవితాన్ని దాటలేరట. కానీ ఆ మాటలోని అర్థాన్ని అవగాహన చేసుకోవడం అందరివల్లా కాదు. అందుకే మనశ్శాంతిని దూరం చేసుకుంటారు. అలా కాకుండా నుదుట ఏది రాసి వుంటే అదే దక్కుతుందనుకుంటే అంతా శాంతే! ఆమె అలా అనుకోవడం వల్లనో ఏమో చాలా శాంతిగా వుంది. టికెట్ తీసుకుని ట్రైన్ లో కూర్చుంది.
కిటికీ లోంచి బయటకి చూస్తుంటే అడవులు, పచ్చటి పంట పొలాలు కనిపిస్తున్నాయి. మనసుకి హాయిగా వుంది. రైలు వేగంగా వెళ్లేకొద్ది అవి కూడా వేగంగా వెళుతున్నాయి.
సంలేఖ కావాలనే కిటికీ పక్కన కూర్చుంది. అలా కూర్చుంటే ఒంటరిగా అన్పించదు. అడవుల్ని, పంటపొలాలను చూడొచ్చు. మనసుకి ప్రకృతి పెట్టే నైవేద్యాన్ని ఆరగిస్తూ వుండొచ్చు. అదో గొప్ప అనుభూతి ఆమెకు.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం 93 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>