జ్ఞాపకం 98 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
సంలేఖ ఉదయాన్నే సిరిమల్లె చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తోంది.
తిలక్ మాటలు, రాజారాం నిర్ణయం ఒకదాని వెంట ఒకటి గుర్తొస్తున్నాయి.
అంతలో “లేఖా!” అంటూ తల్లి పిలవగానే తిరిగి చూసింది సంలేఖ.
“ఏంటమ్మా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్! నాన్నగారికి సమాధి కట్టించాలనేగా. ఇవిగో! నా చేతులకి నాలుగు బంగారు గాజులు వున్నాయి. వీటిలో రెండు అమ్ముకుంటే ఇప్పుడున్న బంగారు రేటును బట్టి మంచి సమాధే కట్టించవచ్చు. నాక్కూడా నాన్నగారికి సమాధి కట్టిస్తే రోజూ అక్కడికెళ్లి దీపం పెట్టుకోవాలని వుంది” అంది ఆశగా.
తల్లి కళ్లలోని ఆరాధనను కరువుతీరా చూస్తూ అలాగే వింటూ కూర్చుంది సంలేఖ.
“నేను చెపితే ఎలా వుంటుందో ఏమో. రాజారాం అన్నయ్యతో నువ్వు మాట్లాడు లేఖా! కావాలంటే ఈ గాజులు ఇప్పుడే తీసి నీ చేతికిస్తాను. వాటిని అమ్మే ఏర్పాట్లు చేసి డబ్బు తెచ్చి అన్నయ్యకివ్వు. అన్నయ్య కట్టిస్తాడు. ఆడపిల్లవి. నాన్నగారి సమాధిని నువ్వు కట్టిస్తే బావుండదు” అంది.
“అక్కడ ఆ అవ్వకూడా ఇలాగే అందమ్మా! ఆడపిల్లలు సమాధులు కట్టించకూడదా అమ్మా? అది శాస్త్రమా?” అంటూ సంలేఖ ప్రస్తుతం ఆస్తులు సరిగా పంచివ్వలేదని తల్లిదండ్రులకి కొడుకులు తలకొరివి పెట్టకుండా పక్కకి తప్పుకుంటే తలకొరివితో పాటు, కర్మల్ని కూడా చేస్తున్న కూతుళ్లని గుర్తుకు తెచ్చుకుంది.
“శాస్త్రాలు నాకు తెలియవు లేఖా! ఈ గాజులైతే నాన్నగారి సమాధి కోసం అమ్మిపెట్టు” అంది సులోచనమ్మ.
అప్పుడొచ్చింది వినీల “గాజులేంటి! అమ్మడమేంటి?” అంటూ.
సులోచనమ్మ కోడలివైపు తిరిగి “మీ మామయ్యగారికి సమాధి కట్టించడం కోసం ఈ గాజుల్ని అమ్మాలను కుంటున్నాను వినీలా!” అంది. గాజులంటే వినీల ఒప్పుకుంటుందనుకుంది. ఎందుకంటే అవి రాజారాం సంపాదన కాదు కాబట్టి ఇంకా సంతోషిస్తుందనుకుంది. అందుకే చాలా సంబరంగా చెప్పింది.
“ఉండేదే నాలుగు గాజులు. వాటిలో రెండు గాజులు అమ్మేస్తే తిలక్ ఒప్పుకుంటాడా? ఎప్పటికైనా రెండు గాజులు అతనికి ఇవ్వందే రేపు మీ శవాన్ని తీసుకుపోయేటప్పుడు నీళ్లు పోసుకొని కుండ పట్టుకుంటాడా? కర్మలు చేస్తాడా? చెప్పండి అత్తయ్యా?” అంది వినీల.
“వున్నాయిగా వినీలా! రెండేగా అమ్మేది. వాడు అడిగినప్పుడు వున్న ఈ రెండు గాజులు ఇస్తే సరిపోతుంది” అంది సులోచనమ్మ.
“మరి నాకో…?” అంది వినీల.
“నీకా…!!”
“అవును నాకే. నాకు వద్దా?”
“నీకెందుకు?”
“ఎందుకంటారెందుకు అత్తయ్యా? నేను మాత్రం ఆ గాజులు చూసికాదా ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో వుంచుకున్నది” అంది వినీల.
“నువ్వు నన్ను వుంచుకున్నావా?”
“అవును! కాదామరి?”
నివ్వెరపోయింది సంలేఖ.
అవాక్కయింది సులోచనమ్మ. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా వుందా? వదిన ఎందుకిలా మాట్లాడుతోంది? ఈ మాటలన్నీ వదినే స్వతహాగా మాట్లాడుతుందా? లేక ఎవరైనా ఇలా మాట్లాడమని నేర్పించి వుంటారా? ఎలా అనుకోవాలి? ఏది ఏమైనా ఇలాంటి మాటల్ని విని తట్టుకోవాలంటే సాధ్యమయ్యే పనికాదు. అప్పటికే సులోచనమ్మ ముఖం పాలిపోయివుంది.
అదిచూసి సంలేఖలో కోపం ఆగక ఒక్కవుదుటన లేచి నిలబడి “ఏం మాట్లాడుతున్నావ్ వదినా?” అంది.
“ఏంటంత కోపంగా లేచి నిలబడ్డావ్! ఆమెను నువ్వు తీసికెళ్లి నీ దగ్గరేమైనా వుంచుకుంటావా?” అంతకన్నా కోపంగా అడిగింది వినీల
“అసలు ఒకరామెను వుంచుకోవడమేంటి? ఆమె వున్నచోటనే వుంది. ఎక్కడి నుండో రాలేదు. ఆమె చెట్టు. కొమ్మ కాదు. అడ్డుగా వుందని నరికెయ్యటానికి. అమ్మ వుండేది అమ్మ ఇంట్లోనే!” ఎంత ఆపుకుందామన్నా కోపం ఆగట్లేదు సంలేఖలో.
“అది మీ నాన్నగారు వున్నప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడామె నా భర్త సంపాదన తింటోంది”
“నీ భర్త అంటే ఆమెకు కొడుకు కాదా? కొడుకు సొమ్ము తినే హక్కు అధికారం తల్లికి వుండవా?”
“వుంటాయి. ఎప్పుడు? అంతో, ఇంతో ఆమె దగ్గర కూడా కొంత ఆస్తి వున్నప్పుడు. ఏముంది మీ అమ్మ దగ్గర? గట్టిగా ఓ పదివేలయినా బ్యాంకులో వుందా? వుంటే చూపించు. నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఏ ఆశా, స్వార్థం లేకుండా అనుబంధాలు నిలుస్తాయా? మీకు తెలియంది ఏమీ లేదు. అయినా నాచేత అనిపించాలని చూస్తుంటారు” అంది వినీల.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
Comments
జ్ఞాపకం 98 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>