జ్ఞాపకం 99 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
సంలేఖ ఎన్నో జీవితాలను పాత్రలుగా మలచి రాయడం వల్లనో, నడుస్తున్న చరిత్రను చూస్తున్నందువల్లనో తెలియదు కాని మౌనంగా వుంది. సులోచనమ్మ మానసిక స్థితి అయితే అగమ్యగోచరంగా వుంది.
సంలేఖ తల్లిని చూసి, ఆమె పడుతున్న నరకయాతనను అర్థం చేసుకొని “నువ్వు మరీ ఇంత నిర్మొహమాటంగా, మనసులు చిట్లిపోయేలా మాట్లాడతావని అనుకోలేదు వదినా!” అంది.
“ఏదైనా ముందే అనుకోవాలి లేఖా! మనసులో పెట్టుకుంటే ప్రయోజనం వుండదు. ఆ మధ్యన మా పెద్దనాన్నకి, పెద్దమ్మకి మా అన్నయ్య కర్మలు చేస్తే మా పెద్దనాన్నకి వున్న ఒకేఒక్క కూతురు కొంచెం కూడా విశ్వాసం చూపించలేదు. ఒకటికి రెండు కర్మలు చేయించుకొని మా అన్నయ్యకి డబ్బులు కాని, పొలం కాని, బంగారం కాని ఇవ్వలేదు. అందుకే ఈ చావులు, కర్మలు, సమాధులు దగ్గర చాలా జాగ్రత్తగా ముందే డీల్ చేసుకోవాలి. లేకుంటే మోసాలు జరుగుతాయి”అంది.
“ఏంటి వదినా నువ్వనేది. మళ్లీ చెప్పు?” అంది సంలేఖ.
“ఆ.. ఏముందిలే మా కర్మ! మళ్లీ మళ్లీ చెప్పటానికి. చెప్పాను. విన్నావు. మళ్లీ చెప్పమంటున్నావు. ఏంటో నువ్వు..”
“నాకు సరిగ్గా అర్థం కాలేదు వదినా! అందుకే కొంచెం క్లారిటీ ఇవ్వమంటున్నాను” అంది.
“మా పెద్దనాన్న కూతురు మా అన్నయ్య చేత వాళ్ల తల్లిదండ్రులకి కర్మలు చేయించుకొని మోసం చేసింది” అంది.
“మళ్లీ చెప్పు!” అంది కావాలనే సంలేఖ.
మళ్లీ అదే చెప్పింది వినీల.
ఆశ్చర్యంతోపాటు అసహ్యం కూడా కలిగింది సంలేఖకు
“కర్మలు చేసినందుకు డబ్బులడుగుతున్నారా? ఇంతకన్నా చెండాలం, నీచం ఇంకొకటి వుందా? అదేమైనా కూలిపనా? వ్యాపారమా? మనిషి చనిపోయాక ఆ మనిషి ఆత్మ ప్రేతాత్మగా మారకుండా ఒక కొడుకు స్థానంలో వుండి చేస్తున్న పుణ్యకార్యం కర్మంటే! దీనికి ప్రతిఫలంగా డబ్బులు, ఆస్తులు, బంగారం అడుగుతారా ఎవరైనా? అలా కొడుకులు లేనివాళ్లకి కర్మలు చేసి డబ్బులు తీసుకుంటే కర్మలు చుట్టుకుంటాయి. మంచి జరగదు” అంది సంలేఖ.
ఆ మాటలేం పట్టించుకోలేదు వినీల “అసలు మా అన్నయ్య ఫ్రీగా చెయ్యమంటే మా పెద్దనాన్నకి, పెద్దమ్మకి కర్మలు చేసేవాడే కాదు. మేం కూడా చెయ్యనిచ్చేవాళ్లం కాదు. తెలియక చేసి మోసపోయాం” అంది మళ్ళీ .
వదిన నైజం కొత్తగా తెలుసుకునేదేం లేకపోయినా ఇలాంటి విషయాల్లో కూడా ఆమె ఇంత నిక్కచ్చిగా, నీచంగా మాట్లాడుతుందని ఊహించలేదు. ఎప్పుడైనా మాటలతోనే మనసు బయటపడుతుంది. బయటపడ్డాక కూడా అర్థం చేసుకోలేకపోవడం అవివేకం. తండ్రి సమాధి కోసం తల్లి గాజులు అమ్మితే మాత్రం వదినతో తల్లికి ఎప్పటికైనా ప్రమాదమే. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. అందుకే “వదినా! ఆ గాజులు ఎప్పటికైనా నీకే. నువ్వేం కంగారు పడకు. తిలక్ అన్నయ్యకు కూడా ఈ విషయంలో న్యాయమే జరుగుతుంది. అమ్మ గాజుల్లో ఒక్క గాజుకూడా అమ్మేది లేదు. నేను హామీ ఇస్తున్నాను” అంది.
వినీల సంతోషపడింది. ఆడపడుచు మీద ఎప్పుడూ కలగనంత గౌరవం కలిగింది. లోగడేమోకాని ఇకముందు ఆమెకు ఇబ్బంది కలిగేలా మాట్లాడకూడదు. బాధపడేలా ప్రవర్తించకూడదు అనుకుంది.
“అత్తయ్యా! మీరు కాఫీ తాగకుండానే వచ్చారు” అంటూ గబగబ లోపలికెళ్లి కాఫీ తెచ్చి సులోచనమ్మ చేతిలో పెట్టింది. కోడలు ఇచ్చిన కాఫీ ఆమెకు గొంతు దిగడం లేదు.
సంలేఖ ఆలోచనలు మరోవిధంగా సాగుతున్నాయి.
*************
సంలేఖకి ఆదిపురి వచ్చాక ఎన్నోరకాల చింతల నుండి బయటపడి “ఇది నాది, నావాళ్లు, నా ఊరు, నాకు అన్నీ వున్నాయి, నేను ఏకాకిని కాను” అన్న భావం కలుగుతోంది.
రోజూ నడుచుకుంటూ పొలం వెళ్లి అక్కడ చాలాసేపు కూర్చుని వస్తోంది. వెళ్లేటప్పుడు పేపర్లున్న ప్యాడ్, పెన్నూ పట్టుకెళ్తుంది. తాతయ్య సమాధికి తండ్రిని ఖననం చేసిన స్థలానికి పక్కన అమ్ముకోకుండా వుంచుకున్న మూడు సెంట్ల పొలంలో మెత్తగా పాదాలకి చల్లగా తగిలే పచ్చటి గడ్డిమీద నడుస్తూ, అక్కడే ఓ గట్టుమీద కూర్చుంటుంది. ఆ గట్టుకి, రోడ్డుకి మధ్యలో పొలానికి పారే నీటి కాలువ వుంటుంది. ఆ కాలువలో కదిలే చేపపిల్లల్ని చూస్తూ మధ్యమధ్యలో రాసుకుంటూ వుంటుంది.
పంటను విశేషంగా పండించుకునేంత పొలం లేకపోయినా ఆ మూడు సెంట్ల పొలం ఆమెకిప్పుడు ప్రశాంతంగా రాసుకోటానికి ఆధారమైంది. అక్కడ ఆమెను ఎవరూ ఏమీ అనరు. రాయొద్దని చెప్పరు.
–అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం 99 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>