జయ కేతనం(కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
శ్రీ వాత్సవ విశ్వవిద్యాలయం.
వైస్-చాన్సెలర్(విసి) ఆఫీసు ప్రక్కన వున్న నిరీక్షా మందిరంలో, దాదాపు పది హేను మిమిషాలనుంచి ప్రొఫెసర్ మాధురి నిరీక్షిస్తోంది.
విసి పర్సనల్ అసిస్టెంట్, గీత, ” లోపల వున్న వున్న ప్రొఫెసర్లంటే విసి గారికి మక్కువ. వాళ్ళు లోపలికి వెళ్ళి అరగంటైంది. కూర్చుని సోది కబుర్లు చెప్పుకుంటున్నారు.” అంది.
విలువైన సమయాన్ని ఇలా భజన పరులతో వృధా చేయడమేమిటని ఆమె లోలోన విసుక్కుంటూండగా, ప్రొఫెసరు లక్ష్మి వచ్చి ఆమెను పలకరించింది.
“మీరింకా కలవలేదా? ఇది నా అప్పాయింటుమెంటు టైం. లోపల యేదైనా సమావేశమా?
“గీత చెప్పిన దాని బట్టి ఒక అరగంటనుంచి కులాసా కబుర్లే. పిలుస్తారని నిరీక్షిస్తున్నాను.”
“మనం వయ్యారాలు ఒలక పోయం కాబట్టి మనమంటే యిష్టం వుండదు.”
“సమస్యలు కూడా ఇష్టం వుండవు. సమస్యలు ప్రస్తావిస్తే, అసహనంతో, మీరిలా సమస్యలు మా దాకా తేకూడదు. మీరే యేదో ఒకటి చేసెయ్యండి అని నిర్లక్ష్యంగా చెప్తారు. అలా అని అవి పరిష్కరించే అధికారం యిస్తారా అంటే ఎంతమాత్రం యివ్వరు. ప్రతి సారి పదవుల పంపకంలో ఆడవారికి మొండి చెయ్యే. “
“తప్పక ఒకటో రెండో విదిలిస్తారు. అవి ఖచ్చితంగా ప్రాధాన్యత లేనివి. కారు, మంచి ఆఫీసు వుండనివి, మగవాళ్ళు మాకొద్దని చెప్పేవి. అలాంటి వాటిలో మనం కష్ట పడి మంచి పనులు చేస్తే, సభలు పెట్టి, అంతా తామే చేసినట్లు ఫోజ్ పెడుతూ, డప్పు కొట్టుకుంటారు.” అంది అక్కసుగా ప్రొఫెసరు లక్ష్మి.
“అవును.” అని మాధురి బదులిస్తూండగా, గలగల మాట్లాడుకుంటూ భజన బృందం బయటికి వచ్చారు.
రెండు నిమిషాల తర్వాత మాధురికి ప్రవేశం లభించింది.
విసి చిరునవ్వుతో “కూర్చోండి. మీరు కోరినట్లు మీకు ఒక మంచి పదవి యిచ్చాను.” అంటూ ఆమెను ఆహ్వానించాడు.
” నా విన్నపం గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. కానీ మీరిచ్చిన అవకాశమే నన్ను ఆలోచింపచేస్తోంది.” అంది మాధురి కూర్చుంటూ.
“ఎందుకలా? కమ్యూనిటీ కాలేజి వంటి పెద్ద సంస్థకి మిమ్మల్ని ప్రిన్సిపల్ గా నియమిస్తే మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు”.
“గత అయిదేళ్ళుగా మన పిజి సెంటరు కోర్డినేటరుగా ఇలాంటి వుద్యోగమే కదా చేసాను. అందుకే కాస్త మార్పుగా వుంటుందని మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి డైరక్టరుగా అవకాశమివ్వమని రిక్వెస్టు చేసాను .”
“దానికి చాలా పోటీ వుంది. మీకిచ్చినది, తక్కువది కాదు.”
”అదొక సమస్యల పుట్ట అని గత ప్రిన్సిపల్ అన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే అధికారాలు లేకుండా అక్కడ పని చెయ్యలేమని చెప్పారు.”
“అధికారాలు పప్పు బెల్లాలు కావు, పంచిపెట్టడానికి. ముందు మీరు బాధ్యత తీసుకోండి. ఆలస్యంలేకుండా మీ అభ్యర్ధనలు ఆమోదించమని రిజిస్ట్రారుకి, ఫైనాన్సు ఆఫీసరుకి చెప్తాను.” .
విసి స్వరంలో ధ్వనించిన అసహనం గుర్తించింది మాధురి. చేసేది లేక బయటికి వచ్చింది.
@@@
కమ్యూనిటీ కాలేజిలో అడుగుపెట్టగానే మాధురికి అక్కడ పరిస్థితి అర్ధమైపోయింది. విద్యార్ధులందరూ ఇరవైయ్యేళ్ళ లోపు వారే. వారికి అవసరమైన శిక్షణ లభించడంలేదు.
అక్కడున్న విభిన్న వృత్తి కోర్సులకు అవసరమైన అధ్యాపకులు లేరు. కొద్ది మంది కాంట్రాక్టులో గత అయిదారు సంవత్సరాలనుంచి పని చేస్తున్నారు. వారి సర్వీసు క్రమబద్ధీకరించకపోవడంతో వారిలో అసంతృప్తి, నిర్లక్షం పెరిగిపోయాయి. ఆస్పత్రి కోర్సుల వంటి వాటికి అతిధి అధ్యాకులు అవసరం. డబ్బు చెల్లింపులు సరిగా లేకపోవడంతో, వారు మానుకున్నారు.
తరగతి గదుల పరిస్థితి అధ్వానంగా వుంది. కంప్యూటరు లాబ్ అధునాతన సౌకర్యాలతో వుంది. బహుశా కంప్యూటరు కొనుగోలులో వచ్చే లంచాల వల్ల కావచ్చు. కారణ మేదైనా అదొక్కటే, ఆనందాన్నిచ్చే అంశం.
ఇంక మిగిలినది ఆటలు, ఆట స్థలాలు, శిక్షకులు. విశాలమైన ఖాళీ స్థలంలో విద్యార్ధులు ఆటలాడుతూ కనిపించారు. ఆ దృశ్యాన్ని ఒక ప్రక్కగా నిలుచుని మాధురి కన్నుల పండువుగా తిలకించింది.
ఆమెను చూసి, క్రీడా శిక్షకురాలు వాణి పరుగున వచ్చింది.
“నమస్తే మేడం! నేషనల్స్ కి శిక్షణనిస్తున్నాను. ఇలా అంటున్నానని అనుకోకండి. కాలేజీ పని చేసినా చెయ్యకున్నా, ఈ ఆట స్థలం బిజీగానే వుంటుంది. ఎందరో విద్యార్ధులు, విద్యార్ధినులు జాతీయ, అంతర్జాతీయ బహుమతులు గెలుచుకున్నారు. ఈసారి కూడా బహుమతులు తెస్తాము. మీ ప్రోత్సాహం మాకుంటే చాలు.” అంది కొద్దిగా ఆయాసపడుతూ.
“నీ గురించి విన్నాను. ఇక్కడకి వస్తున్నానని తెలిసి, నీ గురించి కొంత మంది చెప్పారు. నిన్ను కలవడం సంతోషంగా వుంది. నువ్వొక్క దానివే ఎన్నో సాధిస్తున్నావు. ఇప్పుడు నీకు నేను అండగా వుంటాను.” అంది మాధురి.
“యూనివర్సిటీ వాళ్ళతో దెబ్బలాడి, ఆటల పోటీలకి కావల్సినవి తెచ్చుకోవడం అలవాటైపోయింద్. మాకేగాక భవిష్యత్తులో విద్యార్ధులకి వుపయోగపడేదొకటుంది. మీగురించి నాకు తెలుసు. మీరు సాధించగలుగు తారు.”
ఆశ్చర్యపోతూ మాధురి అడిగింది.
“ఏమిటది? అంత గొప్ప విషయమైతే, నా శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తాను.”
వాణి చేయి చాచి చూపుతూ, ” అదిగో, కళాశాలని ఆనుకుని వున్నపదెకరాల ప్రభుత్వ స్థలం. అది వుంటే భవనాలకు, క్రీడలకు సదుపాయం పెరుగుతుంది. దాని కోసం అంతకు ముందు విసి, రిజిస్ట్రార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దానికి కారణం వారి వైఖరి. పూర్వమొకసారి, వారు మన ప్రభుత్వ పెద్దలతో, మాది కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయం, మీ మాట వినాల్సిన అవసరం మాకు లేదని చెప్పారుట. దాంతో, ప్రభుత్వం వీరికి వ్యతిరేకమై పోయింది.”
“నా వల్ల అవుతుందని ఎలా చెబుతున్నావు?”
“నేను విద్యామంత్రిని కలిసి, హెల్ప్ చెయ్యమని అడిగాను. మీ విసి, రిజిస్ట్రార్లు, సీమ దొరలమనుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కలిసి అడుక్కుంటే, పని కావచ్చునని పుల్లవిరుపుగా చెప్పాడు. మనం ఇప్పుడు త్వరపడకపోతే అది ఎవరో ఒకరు లంచాలిచ్చి కొట్టేస్తారు.”
వాణి బాధ మాధురికి అర్ధమైంది. ఆమె చిరునవ్వుతో, ” ఇలాంటి కష్టమైన పనులకు నిరాడంబరత, పట్టుదల, మరియు సహనం కావాలి. అవి సాధారణంగా మన స్త్రీలకే వుంటాయి. తప్పక సాధిస్తాను.” అని అంది.
“మీరు సెక్రటేరియట్ కి వెళ్ళేటప్పుడు నన్ను పిలవండి మేడం. నా భర్తకి అక్కడే వుద్యోగం. కాస్త సహాయంగా వుంటాడు.” అని ఎంతో వుత్సాహంగా చెప్పింది వాణి.
@@@
మాధురి విసి ని కలిసి, ఆ స్థలం గురించి చెప్పింది. ఆయన విసుక్కుంటూ, ” ఇలా వెళ్ళి అలా ఒక సమస్యని తెచ్చారు. అది ఎంత పెద్దదో ఆలోచించుకోరు. అందుకే మీకు పదవులిచ్చేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. వెళ్ళి రిజిస్ట్రారుని కలవండి.” అని రిజిస్ట్రారుకి ఫోన్ చేసి, విషయం చెప్పాడు.
మాధురి రిజిస్ట్రారుని కలిసింది. ఆయన ఆమెను కూర్చోబెట్టి, ” మంత్రుల గొంతెమ్మ కోరికలు మనం తీర్చలేదు కాబట్టి వాళ్ళు కక్షతో వున్నారు. విద్యుత్తు, నీరు, పోలీసు భద్రత యిస్తున్నాం కాబట్టి, వుద్యోగాల్లో మా పార్టీ కుర్రాళ్ళని వేసుకోమంటే, యెలా? ఇదండీ వారి నిరాకరణకి కారణం. మీ స్థాయిలో ప్రయత్నించి తేగలగితే మాకు అభ్యంతరం వుండదు. మీకు ఆ అధికారమిస్తూ ఇప్పుడే లెటరిస్తాను.”
అని చెప్పాడు.
అక్కడే వున్న డిప్యూటీ రిజిస్ట్రారు, ” అదంత తేలికైన పని కాదు మేడం! ఒకప్పుడు విద్యా సంస్థలకు వుచితంగా యిచ్చారు. ఇప్పుడు రూలు మారింది. అద్దెకు మాతమే యిస్తామంటున్నారు. వాళ్ళు చెప్పే అద్దె కట్టలేము.” అని ప్రస్తుత పరిస్థితి తెలియచేసాడు.
“ఉచితంగా ఇమ్మని కోరతాను. నాకో అవకాశం యివ్వండి.”అంది మాధురి ఆత్మవిశ్వాసంతో.
@@@
ఆరు నెలల తర్వాత, మాధురి విద్యామంత్రిని, సంబంధిత సెక్రటరీని కలిసింది. తను సునామీ బాధిత ప్రాంతంలో పని చేసిన వైనం, అక్కడ పి.జి.సెంటరులో ప్రాంతీయులకు, ముఖ్యంగా భర్తని కోల్పోయిన స్త్రీలకు వుద్యోగాలిచ్చిన వివరాలు, స్థానికి సేవా సంస్థలతో చేయి కలిపి చేసిన సామాజిక సేవల గురించి వివరించింది. ఇక్కడ కూడా ప్రాంతీయ విద్యార్ధుల అభ్యున్నతికి చేస్తున్న కృషి వివరించింది. టీనేజ్ లో వున్న పేద పిల్లలను, మాదక ద్రవ్యాల బారిన పడకుండా రక్షించుకుంటూ, వారిని క్రీడా కారులుగా, వివిధ సంస్థలలో వుద్యోగస్థులుగా చేయడంలో ఆ కళాశాల నిర్వహిస్తున్న పాత్రని పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వారికి, వివరించింది.
ఆమె నిర్వహించిన సభలకు, కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేలు, ఆమెకు అండగా నిలిచారు.
“మేడం కష్ట జీవి. నిస్వార్ధంగా సేవ చేసే వుత్తమురాలు. ఆమె మన బిడ్డలకోసం, వారి చదువులకోసం, ఆటల్లో వారి విజయం కోసం అడుగుతోంది.” అని వారు విద్యామంత్రికి చెప్పారు. మాధురిని తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రికి పరిచయం చేసి, ఆమె కోరిన స్థలం ఉచితంగా ఇమ్మని అర్ధించారు,
మాధురి ముఖ్యమంత్రికి నమస్కరించి, యిలా చెప్పింది,
“కమ్మ్యూనిటీ కాలేజి, విశ్వవిద్యాలయం కాదు, చిన్న కళాశాల. పెద్ద చదువులు నేర్పేది కాదు, బ్రతుకు తెరువులు చూపే పవిత్ర బోధనాలయం. ఇది నిరుపేదలకు మార్గదర్శి. పేద పిల్లల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ఆ భూమి ఇవ్వడం అంటే యువజనుల భవిష్యత్తుకు పునాదివేయడమే. వారి కలలు సాకారం కావాలని ఆశీర్వదించండి.”
@@@
ఏడాదికి వందరూపాయలు చెల్లించేలా ఆ భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాల కాలానికి లీజుగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి G.O జారీ చేసాడు. ఆ వార్త తెలిసి విశ్వవిద్యాలయం మొత్తం ఆశ్చర్యపోయింది. ముఖ్యమంత్రి కి ఒక సన్మాన యేర్పాటు చేసారు.
ముఖ్యమంత్రి వేదిక నెక్కి తన స్థానంలో ఆశీనుడై చుట్టూ చూసాడు. అదేమిటి? వేదికపైన ఇద్దరు తప్ప అందరూ మగ వాళ్ళే. మీకు స్త్రీ అధికారులు, అధ్యాపకులు, లేరా?”అని ఆయన విసి ని అడిగాడు.
” ముప్పది శాతాన్ని మించే వున్నారు. క్రింద సభికుల్లో, కుడి వైపు వున్న వారంతామా మహిళా అధ్యాపకులే.” అని విసి చేయి చాపి చూపించాడు.
“సరే! ప్రొఫెసర్ మాధురి ఎక్కడ?”
“సర్! ఇక్కడే వున్నాను.” అని ఆమె ఆయన వెనుక నుంచి సమాధానమిచ్చింది.
“ముందుకు రామ్మా! సభలో ముందుగా నీ గురించి చెప్పాలి.” అన్నారు
మాధురి సంభ్రమంగా ముందుకు వచ్చి నిలబడింది.
” ఈమె మీకే గాదు నాకు కూడా గురువే. నాకు తెలియనివి తెలియచెప్పి, ఈ పదెకరాల స్థలం యువజనుల కోసం, మన ప్రాంత ప్రజలకోసం యిమ్మని అడిగింది. అంతేనా? కాళ్ళరిగిపోయేలా మా ఆఫీసు చుట్టూ తిరిగారు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అభ్యంతరాలు. అన్నిటికీ ఎంతో ఓపికగా సమాధాన మిచ్చారు. ఆమె స్త్రీ జాతి చరిత్రని తిరగరాస్తున్న, అధునిక మహిళ. స్త్రీని తక్కువగా చూసే సమాజానికి బుద్ధి వచ్చేలా, పని చేసిన ప్రతి చోటా జయకేతనం యెగురవేసారు. ఆమె మీ విద్యార్ధినీ విద్యార్ధులకే గాదు, సమాజ సేవలో వున్న మాకు కూడా స్పూర్తి ప్రదాత.” అని చెప్పి ముఖ్యమంత్రి, పుష్పగుఛ్చాన్ని ఆమెకిచ్చి నమస్కరించాడు.
కరతాళ ధ్వనులతో హాలు నిండిపోయింది, విసి, ఆయన అనుంగు తాబేదార్ల తలలు అవమానభారంతో అవనతమయ్యాయి.
-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

స్త్రీశక్తి గురించి బాగా రాసారు
సంకల్పబలం తపన దీక్ష. ఉన్న మగువకు విజయం తథ్యం
Inspiring story…