భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
మహాత్మా గాంధి రహదారిలో వున్న దీపకాంతులు, పబ్బులు, రెస్టారంట్లు, రహదారి ప్రక్కన బళ్ళు, అన్నీ కలిసి బెంగళూరు నగర రాత్రికి సందడిని, శోభని కలిగిస్తున్నాయి. జనంతో ఆ వీధి కిటకిటలాడిపోతోంది. అ జనవాహినిలో ఎక్కువగా యువతీ యువకులున్నారు.
వినోద్ ఒక పబ్బు ముందు ఆగి ” రావోయి!. ఇది, అన్ని హంగులు వున్న పబ్బు. నేటి యువత సుఖ సంతోషాలకు ఒక చిరునామా. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన నీకిది ఖచ్చితంగా ఒక అద్భుత లోకమనిపిస్తుంది, రా” అని రామకృష్ణ చేయి పట్టుకుని లోనికి నడిచాడు .
“వద్దురా! ఇటువంటివి నాకు సరిపడవు” అంటూ రామకృష్ణ, వినోద్ చేయి విడిపించుకునే ప్రయత్నం చేసాడు.
“ఒక సారి చూడు. యువలోకం పోకడ తెలుస్తుంది” అంటూ వినోద్ రామకృష్ణని బలవంతంగా లోనికి తీసుకుని వెళ్ళాడు.
రంగు రంగుల దీపాల మధ్య, తారాడే వెలుగు నీడల్లో, మధుపానం చేస్తూ నాట్యాలు చేసే, స్త్రీ పురుషులతో అది ఒక స్వర్గధామంలా వుంది.
ఆశ్చర్యంతో స్థాణువులా నిలబడి పోయిన రామకృష్ణ భుజం తట్టి, “ మీ వినోద్, అతడి స్నేహితులు, అక్కడ అప్సరసలతో కలిసి త్రాగుతున్నారు. మీరిలా రండి” అని పిలిచింది సమీర.
” అదేమిటి? నన్ను వదిలి వెళ్ళిపోయాడు!”
“స్వర్గంలో ప్రతి నిమిషాన్ని ఆనందించాలన్నది అతడి విధానం. త్రీ -డి అనుభవం మీరు వద్దని
చెప్పారా? “
“త్రీ- డి అంటే?”
ఆమె చిన్నగా నవ్వి,” త్రీ-డి అంటే, డ్రింక్, డాన్స్, డార్లింగ్. మీకు మీ స్నేహితుడికి పోలికే లేదు “
“నాది నా స్నేహితుడిలా కార్పొరేట్ వుద్యోగం కాదు. లక్షల సంపాదనా లేదు. పాఠశాలలో, పిల్లల సందడిలో, పని చేస్తూ నాలుగు రాళ్ళు ఆర్జించి జీవనం సాగిస్తున్నాను. అతనిది స్వర్గలోకమైతే, నాది బ్రహ్మలోకం. “
అతని మాటలకు ఆమె నవ్వింది. ఒక్క నిమిషం అర్వాత మెల్లగా అంది.
” భిన్నధృవాల్లాంటి మీరు యెలా స్నేహితులయ్యారో? ఫూడ్ ఆర్దరిద్దామా?”
“కాస్త సాత్వికంగా వుండేవి ఆర్డరివ్వండి.”
“అలాగే” అని ఆమె టొమాటో సూప్, పుల్కాలు, ఆలూ పాలక్, కోక్, ఆర్డరిచ్చింది.
ఆ తర్వాత చిరునవ్వుతో రామకృష్ణని చూస్తూ, “ఫూడ్ రావడానికి ఇరవైనిమిషాల పైనే పడుతుంది. ఈ లోగా ఏవైనా కబుర్లు చెప్పండి” అని అంది.
” వినోద్ అలా వెళ్ళిపోవడం మీకు కోపం కలిగించలేదా?” కుతూహలంతో అడిగాడు రామకృష్ణ.
సమీర చిరు దరహాసంతో జవాబిచ్చింది. “మీరేదో కబుర్లు చెప్తారనుకుంటే, నాకు ప్రశ్నలు సంధిస్తున్నారే! పంతులు బుద్ధిపోనిచ్చుకోలేదు.”
“ఒక నిజం చెప్తాను. వినోద్ పది రోజుల క్రితం మీరు తనకి అనుకూలంగా వుండడం లేదని చెప్పాడు. ఒక సారి వచ్చి, మీతో మాట్లాడమన్నాడు.”
“పిలిస్తే నా తండ్రిని పిలవాలి లేదా లాయర్ని పిలవాలి. మిమ్మల్ని, ఒక బ్రహ్మచారిని, అందులో తనకి భిన్నమైన వ్యక్తిని పిలవడంలో ఆంతర్యం యేమై వుంటుంది?”
“తెలియదు. నేను కూడా తగుదునమ్మా అని బయలుదేరి వచ్చాను. వచ్చాక, అనిపించింది, నా రాక అనుచితమైనదని. ఇప్పుడు మీరు, చిరకాల స్నేహితురాలిలా మాట్లాడుతూంటే, జంకు పోయింది.”
“స్నేహితురాలినన్నారు కదా. ఏక వచనంలో మాట్లాడుకుందాం. నీ స్నేహితుడు నీవనుకున్నంత మంచి వాడు కాదు. మా పెళ్ళి జరిగి ఆరునెలలైంది. శోభనం ఇంతవరకు జరగలేదు. మొదట యెందుకా అని కాస్త మధనపడ్డాను. క్రమంగా కారణం తెలిసింది.”
“చెప్పండి”
” నన్నొక ఆటబొమ్మగా, మార్చాలనుకున్నాడు. నన్ను వుద్యోగం చెయ్యనివ్వలేదు. విలాస జీవితం రుచి చూపించాడు. ఆ తర్వాత నన్ను ఇంటికే పరిమితం చేసాడు.”
“అలా చేస్తే ఈ కాలం ఆడపిల్లలు విడిపోతారు గాని పడివుంటారా?” కుతూహలంగా అడిగాడు రామకృష్ణ.
సమీర విరక్తిగా నవ్వింది.
” పేద కుటుంబంలో పుట్టి, చిరుద్యోగం చేసుకునే నన్ను, అణిగిమణిగి వుంటానని పెళ్ళి చేసుకున్నాడు. ఖరీదైన జీవితాన్ని ఒదులుకోలేని బలహీనతతోనో, విడాకులు తీసుకుంటే, తల్లిదండ్రులు చచ్చిపోతారేమోనన్న భయంతోనో, అతని వికృత కోరికలను కాదు అనే ధైర్యం నాకుండదని అతని ధీమా.”
” అతనిది వికార మనస్తత్వమని మీకెలా తెలిసింది?”
” కొన్ని నెలల క్రితం, వినోద్ టూరుకు వెళ్ళినప్పుడు అతని స్నేహితుడు, నన్ను కలిసి అతని రహస్యాలను ఆధారాలతో బట్టబయలుచేసాడు. మీ భర్త లైంగిక వికారాలున్న వ్యక్తి. పైగా భార్యల మార్పిడి గ్రూపులో సభ్యుడు. మీకిష్టమైతే ఓకే. లేకుంటే, జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు.”
“భార్యతో కలిసి పవిత్రంగా జీవించాలనుకోక పోవడం దురదృష్టం.”
” ఒక నెలక్రితం, తన మనసులో వున్న ఆలోచనలను నాతో పంచుకున్నాడు. అంతులేని సుఖానికి రహదారి యిదే అని చెప్పి ఒప్పించబోయాడు. నేను అంగీకరించలేదు.”
“దానికి వినోద్ యేమన్నాడు?”
“షాక్ తిన్నాడు. ఆ తర్వాత, పేదరికం వల్ల వచ్చిన నీచబుద్ధులు ప్రదర్శిస్తే నీకే నష్టం అని బెదిరించాడు. బెల్టుతో కొడతానని భయ పెట్టాడు. నేను తాపీగా మహిళా సంఘానికి ఫోన్ చేస్తాను. గృహ హింస కేసు పెడతాను, జైలుకు పోదువుగాని అని బెదిరించాను.”
“ఆ మాటకు అతనేమన్నాడు?”
“ఒక వారం రోజులు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత నన్ను విడాకులు తీసుకోమన్నాడు. తగిన పరిహారం యిస్తే అభ్యంతరం లేదన్నాను. నయా పైసా కూడా యివ్వనని వెళ్ళిపోయాడు.”
విడాకులు అన్న మాట రామకృష్ణకి నచ్చలేదు .”పిడుగుకీ బియ్యానికి ఒకటే మంత్రం, అన్నట్లు అన్నింటికీ విడాకులే పరిష్కారమైపోయింది. కలికాలం” అని నిట్టూర్చాడు.
ఇంతలో భోజన పదార్ధాలు వచ్చాయి. సంభాషణను ఆపి, తినడానికి వుపక్రమిస్తుండగా వినోద్ వచ్చాడు.
“మీరు తినేయండి. నేను రావడానికి లేట్ అవుతుంది” అని సమాధానం కోసం యెదురుచూడకుండా వెళ్ళిపోయాడు.
“అతడు రాడు. ” అంది సమీర.
రామకృష్ణకి తలకొట్టేసినట్లయ్యింది.“బాల్య స్నేహితుడివి. ఒక్క సారి వచ్చిపో” అంటే వచ్చాడు. తననిలా వదిలి వెళ్ళిపోవడం సమంజసమా? స్నేహితుడి నిర్లక్ష్యం అతడిని బాధించింది.
@@@
శుభ్రమైన గదిలో, మెత్తటి పరుపు మీద పడుకున్నా రామకృష్ణకి నిద్ర రావడంలేదు.. ఇంత రాత్రి వేళ సమీరను, తనను, వదిలి వెళ్ళిన వినోద్ ఆంతర్యం యేమిటో అంతు బట్టటం లేదు. బహుశా, నేను సంప్రదాయ వాదిని కాబట్టి, నా చేత, సమీరకు హితవాక్యాలను చెప్పించాలని అనుకుని వుంటాడు. సమీరని మారమని హితబోధ చెయ్యడం కరక్టా? ఆమె చెప్పిన దాన్నిబట్టి, మారవలసింది వినోద్. అతడు మారడం కష్టం.
అలాగైతే సమీర యేం చెయ్యాలి? అతడినే అంటిబెట్టుకుని వుండి, మంచి రోజు కోసం యెదురు చూడడమా?
ఈ ఆలోచనలతో ఎంత ప్రయత్నించినా నిద్రరాక రామకృష్ణ హాలులోకి వచ్చాడు.
హాలులో, చిరుకాంతిలో సమీర, మంద్ర స్థాయిలో సంగీతం వింటూ, సోఫాలో జారగిలబడి కూర్చుని వుంది. ఆమె రాత్రి దుస్తుల్లో వుండడం చూసిన రామకృష్ణ వెనుదిరగబోయాడు.
ఈలోగా సమీర అతడిని గమనించి, ” వచ్చి యిలా కూర్చో ” అంటూ అక్కడున్న శాలువా తో, ఛాతీని కప్పుకొంది. కాదనలేక, రామకృష్ణ ఆమె కెదురుగా సోఫాలో కూర్చున్నాడు.
“మనసు బాగోలేనప్పుడు నిదుర రాదు, మాట్లాడేందుకు మనిషిలేక, విస్కీని ఆశ్రయిస్తాను.”
“విస్కీ వల్ల ఆరోగ్యం పాడవుతుంది.”
“దేవదాసు చెప్పాడు గదా, బాధే సౌఖ్యమనే భావన రానిమ్మని.”
“అది పలాయన వాదుల మాట. నీకు సమస్య తెలుసు. పరిష్కారాలు తెలుసు.మరి ఇలా త్రాగుతూ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నా వు ?”
“పరిష్కారాలు. హూ! ఒకటి వాడి కాళ్ళ దగ్గర పడి వుండడం. నా వల్ల కాదు. రెండోది, విడాకులు. ఇవ్వడం. దానికి అతను ఒప్పుకోడు. ఇక్కడ ఇరుక్కుపోయాను.”
“వల్లకాదంటే యెలా? రావణాసురుడు మంచివాడనా, మండోదరి కాపురం చేసింది. ఈ కలికాలంలో వాళ్ళే ఆదర్శ దంపతులు.”
” భార్యలు చెడ్డ మొగుళ్ళతో కాపురం చెయ్యాలనే నీ వైఖరిని ఖండిస్తున్నాను” అంటూ ఆమె ఒక పెగ్గు గటగటా త్రాగేసింది,
ఆ తర్వాత ఆమె యిలా అంది.
“ఈ సమాజం ఎంతసేపు స్త్రీని భరించమని, భర్తకి అనుగుణంగా మారమని చెబుతుంది గాని, మగవాడికి యేమీ చెప్పదు. ఎందుకు? నువ్వు చెయ్యాల్సింది. నీ స్నేహితుడిని మార్చడం.”
“స్త్రీని శక్తి స్వరూపమన్నారు. ఆమెకే పురుషుడిని కట్టడి చేసే శక్తి వుంటుంది. అనురాగంతో సాధ్యం కానిది లేదు. ప్రయత్నించి చూడు.”
“. నేను సంస్కర్తను గాను. అతడు సుఖాలనుభవిస్తూంటే, కన్నీళ్ళతో అతడిని ప్రాధేయపడాల్సిన అవసరం నాకేమిటి?”.
“”ఇలా మందు తాగుతూ, నీ ఆరోగ్యం చెడగొట్టుకోవడమెందుకు? సంస్కారవంతమైన దైవిక జీవితం గడుపు. ఆ దేవుడే మిమ్మల్ని ఒక్కటి చేస్తాడు.”
“భిన్న మనస్తత్వాలు కలిగిన మమ్మల్ని కలిపి ఆ దేవుడు తప్పు చేసాడు. ఇప్పుడు ఆ తప్పు దిద్దుకునే మార్గమేమిటో తెలుసా? ఒక మంచి వాడు వచ్చి నన్ను లేవదీసుకుని పొయేలా చేయడం. బహుశా నీ మిత్రుని కోరిక కూడా అదే. అందుకే నిన్ను నాకు తగిలించాడు. లేచిపోదామా?”
ఆమె మాటలకు రామకృష్ణ వులిక్కిపడ్డాడు. రామకృష్ణని సూటిగా చూస్తూ ఆమె ముందుకు వంగింది. శాలువా జారిపడటంతో ఆమె అర్ధ్న నగ్న వక్షోజాల అందాలు బహిర్గతమయ్యాయి. తూగుతూ, కను రెప్పలు మూసి తెరుస్తూ, ఆమె ఇలా అంది.
“నన్ను లేవదీసుకుని పోవడం సులభమే. అలాచేస్తే, వినోద్ నిన్నూ,నన్నూ మెచ్చుకుంటాడు. ఎందుకు? విడాకుల కోసం, పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వనక్కరలేదు కదా!””
ఆమె మాటలకు రామకృష్ణ షాక్ తిన్నాడు. ఒక క్షణం అతని మనసు వూగిసలాడింది. అతడు మనసుని దిటవ చేసుకుని యిలా అన్నాడు.
“ఇలాంటి ఆలోచనలే క్రమంగా నిన్ను పతితని చేస్తాయి. ఆ విస్కీ మానివేసి, నీ పతనాన్ని నిలువరించు. సంప్రదాయ స్త్రీలు, సమస్యలు వచ్చినప్పుడు, కాపురాన్ని నిలబెట్టే పరిష్కారాలను అన్వేషిస్తారు. వారికి విరుద్ధంగా ఈ కాలం యువతులు కాపురాన్ని కూల్చే పరిష్కారం కోసం వెదుకుతున్నారు. అందుకే విడాకులు పెరిగిపోయాయి. నీ సమస్యకి పరిష్కారం నీ చేతిలో వుంది. దగ్గరగా వుంటూనో, దూరమయ్యో, వాడిని మార్చుకుని, క్రొత్త జీవితం ఆరంభించు.”
“అతడు మారడానికి జీవితకాలం కావాలి. ఈలోగా, బద్ధ శత్రువుల్లా వున్న మాలో ఒకరు నేరాలు -ఘోరాల జాబితాలోకి చేరినా ఆశ్చర్యం లేదు” అంటూ ఆమె భారంగా నిట్టూర్చి కనులు మూసుకుని వెనక్కు వాలింది.
అలా పడుకున్న సమీర, యెంతో అందంగా కనిపిస్తోంది. నీలి రంగు రాత్రి బల్బు కాంతిలో, ఆమె చెక్కిళ్ళు మెరుస్తున్నాయి, గులాబీ రంగు పెదవులు, మనసులో గుబులు పుట్టిస్తున్నాయి. ఆమె శరీరం మరుని విల్లులా వుంది. ఆమెనలా చూసి రామకృష్ణ మనసు చలించింది. వాంఛ చెలరేగింది. అతడు ఎంతో బలవంతం మీద నిగ్రహించుకుంటూ, “తప్పు ఎవ్వరు చేసినా తప్పే. నేనిక్కడే వుంటే తప్పు జరిగే ప్రమాదముంది. నేను మా వూరు వెళ్ళిపోతాను” అని గట్టిగా ఆమెకు వినబడేలా అన్నాడు. ఆమె నుంచి యే సమాధానమూ లేదు. బహుశా నిద్ర పోయి వుంటుంది.
@@@
బెంగళూరు అనుభవం జరిగి ఆరు నెలలైంది. “మనం లేచిపోదామా” అని సమీర అన్నప్పుడు అతని గుండె ఝల్లుమంది. ఈ నాటికీ, సోఫాలో వాలిపోయి నిదురిస్తున్న ఆమె రూపం, కనుల ముందు నిలిచి అతడిని మోహ పరవశుడిని చేస్తోంది . అవకాశాన్ని వదులుకున్నానా, లేక ధర్మాన్ని కాపాడానా? ఇదొక ఎడతెగని మీమాంస. ఎలా వుందో సమీర? ఆమె చెప్పినట్లుగా నేనూ సమీర ఆ రాత్రి కామ వాంఛతో తప్పు చేయాలని, వినోద్ కోరుకున్నాడా?”
అంతే అయివుంటుంది. ఆ రోజునుంచి ఒక్క ఫోన్ లేదు, మెసేజ్ లేదు.
సమీరని తలుచుకుంటే కలిగే మోహం శరీరాన్ని వేడెక్కిస్తోంది, వినోద్ ని గుర్తు చేసుకుంటే పుట్టే కోపం గుండెని మండిస్తోంది. ఈ ఆలోచనలనుండి విముక్తి పొందడానికి అతను కొన్నాళ్ళు దక్షిణాదిలోని పర్యాటక ప్రదేశాలు దర్శిస్తూ కాలం గడపాలనుకున్నాడు.
ప్రప్రధమంగా కన్యాకుమారి చేరుకున్నాడు. అక్కడ వివేకానందుని దర్శించి, ధ్యానమందిరంలో కొద్ది సేపు గడిపాడు. ఆ తర్వాత, కొండపైన తిరుగుతూ, ఒక కాషాయ గుంపుతో కలిసి వున్న సమీరను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె అతడిని చూసి, దగ్గరకు వచ్చింది.
‘ సారీ! నీకు తెలుసా! ఒక నెల క్రితం, నీ స్నేహితుడు కారు ప్రమాదంలో చనిపోయాడు. దేవుడి పరిష్కారమిది”.
ఆ మాట చెప్పి ఆమె తన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయింది. వారంతా నుదుట సింధూర నామం, చేతిలో జపమాల, ధరించి వున్నారు. రామకృష్ణ అయోమయంలో పడి, ఆమె దగ్గరకు వెళ్ళాడు.
సమీర అతని దగ్గరకు వచ్చి, ” చెప్పేందు కేముంది? అతని జీవితం ముగిసింది. వినోద్ చేసిన అప్పులన్నీ తీర్చి, అతని పరువు నిలబెట్టాను. నాకేం మిగలలేదు. నా దురదృష్ట జీవితానికి భవిష్యత్తు యేమిటా అని ఆలోచిస్తుండగా వీళ్ళు పరిచయమయ్యారు. చూడాలి, వీరెంత వరకు, త్రోవ చూపిస్తారో.”
” నేను గుర్తుకు రాలేదా, లేక నీ దృష్టిలో నేనులేనా? “
“ఎలా మర్చిపోతాను? నీ స్నేహితుడు నన్ను విధవను చేసాడు. నువ్వు, నన్ను పతితగా చూసావు. ఒక పతితకి, విధవకి, నీ సాంప్రదాయ సమాజంలో గౌరవముండదు గదా!”
ఆమాటలని, ఆమె అతని జవాబు కోసం యెదురు చూడకుండా ముందుకు సాగింది.
రామకృష్ణ నిరుత్తరుడయ్యాడు.అతని మనసులో తెలియని ఆవేదన. అతనిలా అనుకున్నాడు.
“అటు భ్రష్టాచారియైన వినోద్ ని, ఇటు బ్రహ్మచారినైన నైన నన్ను, ఎందుకు నిరసించింది? కారణం మా అహంకారం. మా ఆలోచనలలో, ఆమెకు మేలు చేయాలన్న ఆకాంక్ష లేదు. భిన్నధృవాలమైన మా ఆలోచనలలో స్త్రీ ఒక వస్తువు. అద్వితీయమైన భోగ వస్తువు. ఆమె దేహాన్ని నలుగురి తో పంచుకోవాలని వినోద్ భావించాడు. ఆమెను సంప్రదాయం యొక్క నాలుగు గోడల మధ్య బందీ చేయాలని నేననుకున్నాను. అందుకే భిన్నధృవాలమైన మా మధ్య లోలకంలాగా, ఆమె యిద్దరికీ దూరంగా వుండిపోయింది.”
-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆలోచింపచేసే కథ…సమాజంలో వ్యక్తిపరమైన ఆలోచనలు మనస్తత్వాలు కలిసి బ్రతకటానికి అవరోధాలుగా మారుతున్నాయి..ఆధ్యాత్మికత కొందరిలో దాంపత్య జీవితంపట్ల
విరక్తిని కలుగచేస్తే కొందరిలో ఆధునికత శృంగార జీవితాన్ని గడపాలని ప్రేరేపిస్తుంది.భార్యాభర్తలలో విభేదాలకు ఇదే కారణం
విరక్తి రక్తి మధ్య ఊగిసలాడే బ్రతుకులు మనిషివి
ధన్యవాదములు
ఆధునికత పేరుతో వికృత ధోరణిని అలవరుచుకుని, తన భార్య, తన మాటే వినాలవుకున్న వినోద్, ఛాందస భావాలతో ఆడవారు సర్దుకుపోవాలి తప్పు ఎవరిలో ఉన్నా అని భావిస్తున్న రామకృష్ణ ఇద్దరూ పురుష అహంకారానికీ ప్రతీకలే. ఈ విషయాన్ని రచయిత, చాలా చక్కగా తెలియజేశారు సమీర ద్వారా.
మీ అభిప్రాయం నాకు ప్రేరణ దాయకం. ధన్యవాదములు
Thought provoking with a deep message 👍
Thanks for your valuable opinion
కథ చదువుతున్నంతసేపూ ముగింపు ఏ రకంగా ఇచ్చారా అని ఆలోచన … చాలా కొత్తగా బావుంది
మీ అభిప్రాయం నాకెంతో విలువైనది.మీకు నా ధన్యవాదములు
ఆలోచించే విధంగా ఉంది
సమాసధృకథము ఎలా మారుతోందో అని .
బాగుంది .
కథనము ఆలోచింపచేస్తోంది
బాగుంది
సమాధానం లేని సమాజం మనది
యీ కాలంలో రావణాసురుడు రాముడు పంధా
యింటింటి రామాయణం కధ బాగా చెప్పారు
ధన్యవాదములు
రచయిత నేటి సమాజం కలిపురుషుడి కోరలకి ఎట్లా చిక్కిందో సాదోహరంగా చెప్పాడు. Thank you. ఈ కధ చదివి యువత ఎమంటుంది? . సంధియుగంలో ఉన్న so called elders, ఈ యువత పురోగతికి పతనానికి సాక్షి. నడమంత్రపు సిరిసంపదలు ఈ అధర్మ జీవనానికి ప్రాతిపదిక కావటం very sad. We elders don’t accept these individuals wealth as token of protest.
మీ ఆలోచనలు సమంజసమైనవి. మీ లాంటి తాత్వికుల అభిప్రాయం నాకు ఉత్తేజకరం