ఆలోచిస్తే …2 – డిజిటల్ యుగంలో మహిళా భద్రత- (సి.హెచ్.ప్రతాప్)

నేటి సాంకేతిక విప్లవ శక్తితో, మహిళలు ఈ విశాల ప్రపంచాన్ని తమ ఆలోచనలతోనే వశం చేసుకోగలుగుతున్నారు. విజ్ఞానం, అపారమైన అవకాశాలు, ఉన్నతమైన వృత్తి మార్గాలు—ఇలా ప్రతి రంగానికీ తలుపులు విశాలంగా తెరచుకున్నాయి.. కానీ ఈ వెలుగుతోపాటు ఒక తీవ్రమైన చీకటి కూడా వారి జీవితాలలోకి విస్తరించింది. అదే అంతర్జాల ప్రపంచంలో మహిళల రక్షణ. ఈ సమాజంలో అప్పటివరకు ఎదుర్కొంటున్న భౌతిక బెదిరింపుల నుంచి బయటపడ్డామనుకునే సమయానికే, మానసికంగా మరింత ఘోరంగా దాడిచేసే సాంకేతిక నేరాలు మహిళల జీవితాల్లో కొత్త భయం నింపుతున్నాయి.
ఇటీవలి మూడు ఉదాహరణలు ఈ సమస్య ఎంత లోతుగా విస్తరించిందో మనకు స్పష్తం చేస్తోంది.
ఒక ప్రముఖ వృత్తిపరమైన మహిళా ఉద్యోగి సామాజిక వేదికలో పెట్టిన వ్యక్తిగత చిత్రాలు దొంగిలించబడి, మార్పులు చేసి, అసభ్యకర రూపంలో వ్యాప్తి చేశారు. మనసును ఛిద్రం చేసే ఈ అవమానం ఆమె వ్యక్తిగత జీవితం, వృత్తిని ఒక్కసారిగా కుదిపేసింది. శక్తి, ప్రతిభ ఉన్నా, ఒకనాటి డిజిటల్ నేరం ఆమెను బంధించి, ఎన్నో రోజులపాటు ఉద్యోగానికి కాదు కదా కనీసం ఇంటి బయటకు కూడా వెళ్లలేని స్థితికి నెట్టింది.
మరొక సందర్భంలో, ఒక యువతి నకిలీ ప్రేమ వలలో చిక్కుకుంది. అంతర్జాల స్నేహ వేదికలో తన పేరుతో, బొమ్మలతో నకిలీగా సృష్టించిన వ్యక్తిని నిజమనుకుని ఆమె విశ్వసించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమె వ్యక్తిగత వివరాలను బలవంతంగా అడిగి, బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రేమ రూపంలో వచ్చిన మోసం ఆమె మనసులో ఎప్పటికీ పోని గాయం మిగిల్చింది.
మూడవ ఘటనలో, ఒక విశ్రాంత ఉద్యోగిని బ్యాంకు నుంచి వచ్చినట్టుగా నమ్మకంగా కనిపించిన సందేశం నమ్మి, తన బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వినరాలు, తన మొబైల్ కు వచ్చిన ఓటిపి తో సహా రహస్య వివరాలు ఇచ్చింది. కొన్ని నిమిషాల్లోనే ఆమె ఖాతాలోని సొమ్మంతా మాయం అయిపోయింది. ఒక సాధారణ సందేశం ఆమె ఆర్థిక భద్రతను పూర్తిగా కూల్చేసింది. డిజిటల్ యుగంలో జరుగుతున్న వ్యక్తిగత వివరాల దోపిడీ ఎంత క్రూరంగా ఉంటుందో ఈ ఘటన స్పష్టంగా చూపించింది.
ఈ సంఘటనలు ఒక్కొక్కటి ఒక మహిళా జీవితాన్ని దెబ్బతీసినట్లే కనిపించినా, అసలు సమస్య మరింత లోతైనది. సాంకేతిక నేరాలకు బలవుతున్న మహిళల సంఖ్య పెరుగుతుండటానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి—వ్యక్తిగత వివరాలు నిర్లక్ష్యంగా నిర్వహించడం, సంకేతపదాలను బలహీనంగా ఉంచడం, గోప్యతా అమరికలను సరిగా వినియోగించకపోవడం, పైగా అంతర్జాలంపై నమ్మకం పెరగటం. లోతైన నకిలీ బొమ్మలు, నకిలీ వ్యక్తిత్వాలు సృష్టించడం వంటి నేరాలు వేగంగా పెరుగుతుండగా, వాటిని అరికట్టే చట్టాలు మాత్రం వెనుకబడి ఉన్నాయి.
అభివృద్ధి చెందిన దేశాలు మహిళలను సాంకేతిక నేరాల నుండి రక్షించడానికి అనేక పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఈ దేశాలలో అంతర్జాల వేధింపులు, లోతైన నకిలీ బొమ్మలు (డీప్‌ఫేక్‌లు) మరియు వ్యక్తిగత వివరాల అపహరణ వంటి నేరాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకమైన, కఠినమైన శాసనాలను రూపొందించారు. ఈ శాసనాల ద్వారా నేరాలకు పాల్పడినవారికి భారీ జరిమానాలతో పాటు దీర్ఘకాల జైలు శిక్షలు విధిస్తున్నారు. అలాగే, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి, డిజిటల్ ఆధారాలను సేకరించడానికి సాంకేతిక నేరాల ప్రత్యేక విభాగాలు (సైబర్ క్రైమ్ యూనిట్స్) నెలకొల్పబడ్డాయి. ఈ విభాగాలు మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. దీనితో పాటు, ప్రభుత్వం మరియు వివిధ సామాజిక సంస్థలు కలిసి సాంకేతిక అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ) కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు అంతర్జాలంలో గోప్యతా అమరికలు (ప్రైవసీ సెట్టింగ్స్) ఎలా ఉపయోగించాలి, బలమైన సంకేతపదాలు (పాస్వర్డ్స్) ఎలా సృష్టించాలి మరియు అనుమానాస్పద సందేశాలను (ఫిషింగ్) ఎలా గుర్తించాలో వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా చట్టం, సాంకేతికత మరియు విద్య ద్వారా ఈ దేశాలు మహిళలకు అంతర్జాలంలో ఒక సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి.
సాంకేతికంగా, సామాజికంగా, చట్టపరంగా మనం ఇప్పటికీ అసమర్థులమని ఈ ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. మహిళలు తమ రక్షణ కోసం బలమైన సంకేతపదాలు, ద్విముఖ ధృవీకరణ వంటి రక్షణ పద్ధతులను తప్పనిసరిగా అవలంబించాలి. వ్యక్తిగత వివరాలు ఎవరికీ పంచకూడదనే అవగాహన విసృతంగా పెంచాలి.
అయితే, బాధ్యత మహిళలదే అన్న భావన కూడా ప్రమాదకరం. సాంకేతిక నేరాలను అరికట్టడం ప్రభుత్వం, చట్టవ్యవస్థ, అంతర్జాల సంస్థల ఉమ్మడి బాధ్యత. డీప్‌ఫేక్స్, నకిలీ వ్యక్తిత్వాల ద్వారా జరిగే నేరాలకు ప్రత్యేక కఠిన శిక్షలు, వేగవంతమైన విచారణలు ఉండాలి. మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయడానికి గోప్యత రక్షించే విధానాలు, ప్రత్యేక సాంకేతిక పోలీసు విభాగాలు ప్రతి జిల్లాలో ఉండాలి.
అంతర్జాల వేదికలను నిర్వహించే సంస్థలు తమ వేదికలపై జరిగే మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు పూర్తిగా బాధ్యత వహించేలా శాసనాలు రావాలి. ఫిర్యాదు చేసిన వెంటనే చర్య తీసుకునే యంత్రాంగం లేకపోతే, మహిళల డిజిటల్ స్వేచ్ఛ శూన్యమవుతుంది.
ఈ సాంకేతిక వెలుగుల యుగంలో, మహిళలు ఏ మాత్రం భయపడకుండా, తమ అడుగులను ధైర్యంగా, స్థిరంగా, స్వాభిమానంతో ముందుకు వేయాలి. అంతర్జాలంలో మహిళా భద్రత అనేది ఎవరి దయాదాక్షిణ్యం కాదు, అది రాజ్యాంగం కల్పించిన ఆమె అఖండమైన హక్కు మరియు ఆమె గౌరవం. ఆ హక్కును పరిరక్షించడం కేవలం సమాజం యొక్క కనీస బాధ్యత.
– డా:సి.హెచ్.ప్రతాప్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
ఆలోచిస్తే …2 – డిజిటల్ యుగంలో మహిళా భద్రత- (సి.హెచ్.ప్రతాప్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>