లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు – ( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే

భారతదేశానికి ప్రపంచ దేశాలు శిరస్సు వంచి నమస్కరిస్తాయి అంటారు. ముఖ్యంగా మన భారత స్త్రీ అంటే ప్రపంచానికి ఎంతో గౌరవం అంటారు. మన దేశ సంప్రదాయం, సంస్కృతి, నైతిక వ్యవస్థ గురించి ప్రపంచం మనలను చూసి నేర్చుకుంటుంది అని మనం గర్వపడుతున్నాం. కానీ మన దేశంలోనే అనేక మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలోనే స్త్రీలపై మరియు మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు చూస్తుంటే ఈ సమాజం ఆటవిక స్థితికి దిగజారి పోతుందని అర్థమవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో భారతదేశానికి మనం ఎలాంటి భవిష్యత్తును ఇవ్వగలుగుతున్నాము అన్నది ఒక ప్రశ్నగా మిగులుతున్నది.
ఈ నెలలో వార్తాపత్రికల్లో మరియు టీవీ చానల్స్ లో చాలా ఘోరమైన సంఘటనలు జరిగాయని కథనాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం, సామూహికంగా అత్యాచారం మరియు ఆ బాలిక గర్భవతి అని తెలిసి ఆమెను సజీవంగా పూడ్చిపెట్టడానికి ప్రయత్నించారు అనే వార్త వచ్చింది. ఇది ఒడిశాలో జరిగిందని తెలుస్తుంది. అలాగే ఒక బాలికపై అఘాయిత్యం కేసులో నిందితునికి జీవిత ఖైదు. ఇతనికి 57 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం మూడేళ్ల బాలికపై అత్యాచారం. ఇది కడప జిల్లాలో జరిగిందని తెలుస్తుంది. అలాగే సత్యసాయి జిల్లాలో బాలికపై అఘాయిత్యం, ముఖ్యంగా సెల్ఫోన్లో బాలికపై అఘాయిత్యం చేసి దానిని వీడియో తీసి, అది చూపించి బెదిరించి కొన్ని నెలలుగా దారుణం చేస్తున్నారని వార్త వచ్చింది. ఇటువంటి వార్తలు తెలిసినపుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మనసంతా క్రోధంతో, దిగులుతో నిండిపోతుంది. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణాలు ఏమిటి? అసలు మనిషిలో ఇటువంటి నైజం ఎందుకు వృద్ధి చెందుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోంది? మన ఇళ్లల్లోనా? సమాజంలోనా? విద్యా వ్యవస్థలోనా? చట్ట వ్యవస్థలోనా? ఎన్ని జవాబులు వెతకజూసినా, ప్రశ్నలు ఎన్నో మిగిలే ఉంటున్నాయి.
అయితే ప్రపంచంలో చాలా దేశాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మన భారతదేశం ముఖ్యంగా ఆసియా ఖండం ఇటువంటి సంఘటనలలో అగ్రగామిగా ఉంది అని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎన్నో చట్టాలు చేసి శిక్షలు విధిస్తున్నా, ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యంగా 57 సంవత్సరాల వయసు వ్యక్తి మూడు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయడం. ఇది చాలా వికృతంగా ఉంది. ఇది అతి హేయమైన చర్య. ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్న వారిని సమాజంలో తిరగనివ్వకూడదు. కానీ మన పొరుగింటిలోనే ఇటువంటి మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తి ఉన్నా, మనకు తెలియదు. ఆ వ్యక్తి ప్రవర్తన ఆ రుగ్మతను తెలియజేసేలా ఉండదు. అందుకే ఎందరో బాలికలు, మహిళలు ఇటువంటి రాక్షసుల బారిన పడుతున్నారు.
భారతదేశంలో పిల్లలపై లైంగిక వేధింపుల విషయంలో ఆందోళనకరమైన గణాంకాలు ఉన్నాయి. అత్యాచారాలు, అఘాయిత్యాల బారిన పడిన వారు వారి జీవిత కాలంలో వీటి ప్రభావం నుండి బయటపడలేక ఎంతో మానసిక వ్యధను అనుభవిస్తారు. ఇటువంటి సంఘటనలు కొనసాగుతూనే ఉంటే, మన దేశ భవిష్యత్తు ఏమవుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలో లైంగిక వేధింపుల్లో భాగంగా 28.9% మంది పిల్లలు ఏదో ఒక రకంగా ఈ వేధింపులకు గురవుతూనే ఉన్నారు.
భారతదేశంలో నివేదించబడిన పిల్లలపై వేధింపుల కేసులు, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసులు ఒక దశాబ్ద కాలంగా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక రుగ్మతలు, భయం మరియు అవగాహన లేకపోవడం వల్ల చాలా కేసులు నివేదించబడకుండా పోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. 2022లో భారతదేశంలో పిల్లలపై వేధింపుల కేసులు 8.7% పెరిగి మొత్తం 162,000 సంఘటనలకు చేరుకున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదించింది.
ప్రతి సంవత్సరం, NCRB భారత శిక్షాస్మృతి (IPC) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం, 2012 వంటి ప్రత్యేక చట్టాల కింద నమోదైన నేరాల వివరాలను సమగ్ర నేర గణాంకాలను విడుదల చేసినా, చట్టాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చినా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
భారతదేశంలో పిల్లలపై లైంగిక వేధింపులు సామాజిక మరియు ఆర్థిక అంశాల సంక్లిష్ట వలయంలో వృద్ధి చెందుతాయి. పేదరికం, విద్య లేకపోవడం మరియు ఒత్తిడితో కూడిన జీవన పరిస్థితులు ఒత్తిడిని కలిగిస్తాయి, ప్రమాదాన్ని పెంచుతాయి. హింసాత్మక చర్యల ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నాం అన్నది నిజం. అదనంగా, మానసిక ఆరోగ్యం చుట్టూ లోతుగా పాతుకుపోయిన సామాజిక రుగ్మతలు మరియు పిల్లలపై వేధింపుల గురించి సాధారణ అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్యను గుర్తించడం మరియు పరిష్కరించడం కష్టమవుతుంది.
పిల్లలపై లైంగిక వేధింపుల ప్రభావాలు:
జీవితాంతం మానసిక ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుంది: నిరాశ, ఆందోళనల నుండి బయటపడడం కష్టం అవుతుంది.
విద్యా సంస్థలపై నమ్మకం మరియు భవిష్యత్తు సామాజిక-ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కుటుంబం మరియు సమాజ శ్రేయస్సును ప్రభావితం చేసే అంతర్-తరాల గాయ చక్రాన్ని సృష్టిస్తుంది.
భారతీయ పిల్లలు ప్రపంచ పిల్లల జనాభాలో 19% ఉన్నారు. 2005–2013లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల విద్యా నిధి అధ్యయనం ప్రకారం భారతీయ బాలికలలో CSA 42% ఉందని నివేదించింది.[8] 2007లో భారత ప్రభుత్వం, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) 13 భారతీయ రాష్ట్రాల్లో 125,000 మంది పిల్లలను ఇంటర్వ్యూ చేసిన అధ్యయనం ప్రకారం, పిల్లలపై ఇటువంటి చర్యల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది (శారీరక వేధింపులు [66%], లైంగిక వేధింపులు [50%] మరియు భావోద్వేగ వేధింపులు [50%]) మరియు 20% కంటే ఎక్కువ మంది తీవ్రమైన లైంగిక వేధింపులకు గురయ్యారు, వాటిలో: లైంగిక దాడి, పిల్లల ప్రైవేట్ భాగాలపై దాడి లేదా ప్రేరేపించడం, పిల్లల ప్రైవేట్ శరీర భాగాలను ప్రదర్శించేలా చేయడం మరియు నగ్నంగా ఫోటో తీయడం వంటివి ఎన్నో ఉన్నాయి. రెండు ప్రధాన సర్వేలలో, వేధింపులకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది పిల్లలకు తెలిసిన వ్యక్తులు లేదా నమ్మకం మరియు బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నవారు. పొరుగువారు, స్నేహితులు, దగ్గరి బంధువులు మరియు పరిచయస్తులు మరియు కార్యాలయాల్లో యజమానులు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారని అనేక నివేదికలు సూచిస్తున్నాయి.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి ఇపుడు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఏ వ్యక్తి అయినా, తమతో అనుచితంగా ప్రవర్తిస్తే, ఏమి చేయాలో చెప్తున్నారు. కొన్ని కుటుంబాలలో పాస్ కోడ్ లను కూడా వాడుతున్నారు. ఇలా, అవగాహన తల్లిదండ్రులతో మొదలయ్యి, సమాజంలో ప్రతి వ్యక్తి ఈ అంశం పట్ల అవగాహన కలిగి ఉండాలి. పిల్లలో, మహిళలో ఏదైనా సమస్యలో ఇరుక్కుని, సహాయం కోరితే, సమాజంలో ఏ వ్యక్తి అయినా వెంటనే ప్రతిస్పందించి, తక్షణం సహాయం అందించే గుణాన్ని అలవరచుకోవాలి.
పిల్లలు లైంగిక వేధింపుల బారిన పడినపుడు, కొందరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కొందరు మౌనంగా ఉండిపోతారు, కొందరు భయంతో తమలో తామే క్రుంగిపోతారు. పిల్లలను తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు కనిపెట్టుకుని ఉండాలి, ఏదైనా తేడా కనిపిస్తే, వాళ్ళను అడగాలి, ఏదైనా నిరాశ లేదా కోపాన్ని గుర్తించాలి, వారితో స్నేహంగా మాట్లాడి, విషయం తెలుసుకోవాలి. యువత తమ రక్షణాత్మక లేదా అదుపులేని ప్రతిస్పందనలను ప్రేరేపించే చర్యలను గుర్తించడం నేర్పించగలిగితే, సమస్య తీవ్రతరం కాకుండా నిరోధించవచ్చు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గుర్తించి విషయం తెలుసుకున్నపుడు, చర్య తీసుకోవడానికి పరిష్కారాలు మరియు ప్రత్యామ్నాయాలను అందించవచ్చు.
విద్యాసంస్థల యొక్క బాధ్యత:
పిల్లలు పాఠశాలలో ప్రవేశించిన తర్వాత, లైంగిక వేధింపులు మరియు తగిన చర్యల గురించి చర్చలు తరగతి బోధనలో ఒక సాధారణ భాగంగా మారాలి. ఇది విద్యార్థులకు స్వీయ-సంరక్షణలో అభ్యాసాన్ని అందిస్తుంది, ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ప్రతి పాఠశాలలో సైకలాజికల్ కౌన్సెలర్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ప్రైవేటు పాఠశాలలు కూడా కౌన్సెలింగ్ వింగ్ ను స్థాపించి, ప్రతి విద్యార్థి కౌన్సెలర్ తో ప్రతి వారం సమయం గడిపి, తన సమస్యలను తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి.
తరగతి గది బోధనలో రోల్-ప్లే విధానాలు అవలంబించడం వల్ల, విద్యార్థులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటికి ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలను నేర్చుకోవడానికి మరియు సాధన చేయడానికి సహాయపడతాయి. చిన్న వయస్సు నుండే తరగతి గదులలో మానసిక ఆరోగ్య సమస్యలను బోధించడం సిగ్గు, ఒంటరితనం మరియు శక్తిహీనత వంటి భావోద్వేగాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
టీవీ వాణిజ్య ప్రకటనలు మరియు సినిమాలు పురుషులను శారీరకంగా మరియు మానసికంగా బలంగా చిత్రీకరిస్తాయి. ఈ రకమైన చిత్రీకరణ మారాలి. అలాగే తరగతి గదిలో, పాఠశాలలో బాలురు, బాలికలు సమానమని తెలియజేసే కృత్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. బాలికల పట్ల ఆరోగ్యకరమైన, స్నేహాత్మకమైన ప్రవర్తన కలిగి ఉండేలా బాలురకు శిక్షణ ఇవ్వాలి. చట్టపరమైన శిక్షల గురించి అవగాహన కల్పించాలి.
కుటుంబ వ్యవస్థ:
మన ఈ సృష్టిలో మానవ జగతికి అత్యంత బలమైన సమాజం కుటుంబ వ్యవస్థ. ఇది భావోద్వేగాలకు, నైతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందులో తల్లిదండ్రులు బాధ్యత ఎంతో ఉంటుంది. వీరు పిల్లలను బాధ్యతగా పెంచితే, సమాజంలో వారు ఎటువంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా మనదేశంలో పితృస్వామ్య వ్యవస్థ వేళ్ళతో పాతుకుపోయి ఉంది. దీనిని మనం పెకలించాలి. పురుషాధిక్యత నుండి బయటపడాలి. బాలురు మరియు బాలికలు సమానమనే భావనను సృష్టించాలి. కుటుంబంలో స్త్రీలను గౌరవించడం నేర్చుకోగలగాలి అలాగే సృష్టికి మూలం మన తల్లిదండ్రులు అని, వారు స్త్రీ పురుషులు అని వారికి సమాన భాగస్వామ్యం ఉంటుందని పిల్లలకు అర్థమయ్యేలా కుటుంబ వ్యవస్థ నేర్పించాలి. అలాగే విద్యావ్యవస్థలు సామాజిక క్రమశిక్షణను మరియు మానసిక ఆరోగ్య ఎదుగుదలను నేర్పిస్తాయి. అలాగే వారికి సృజనాత్మకత నేర్పించి భవిష్యత్తులో వారు ఆర్థికంగానూ, మానసికంగానూ, ఆరోగ్యంగానూ ఎదిగి, సమాజంలో భాగస్వాములై దేశాభివృద్ధికి మంచి పౌరులుగా తోడ్పడేలా విద్యను అందించాలి. ఆ విధమైనటువంటి విద్య అందినప్పుడు సమాజంలో ఇలాంటి రుగ్మతలు ఏర్పడవు. పసిపిల్లలు రక్షించబడతారు. ఎప్పుడైతే మెదడులో మానసిక రుగ్మతలు మొదలవుతాయో అవి చాలా ప్రమాదకరమైనవి. పిల్లలకు సమాజం గురించి అర్థమయ్యేటట్లు చెప్పాలి. చిన్నప్పటినుండే వారికి మానసిక ఆరోగ్యాన్ని అందించాలి.వారు ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే మానసిక శక్తిని వారికి అందించాలి. అప్పుడు ఏ సమస్యనైనా పిల్లలు ఎదుర్కొని, వారి స్వీయ రక్షణలో నిపుణులవుతారు. అందువల్ల వారి సంరక్షణ వారే చూసుకోగలుగుతారు. అప్పుడు సమాజంలో ఇలాంటి అఘాయిత్యాలు పూర్తిగా తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది.
వ్యక్తులుగా, ధైర్యవంతులుగా, సమసమాజ నిర్మాతలుగా పిల్లలు ఎదగాలంటే కుటుంబం, సమాజం వారి పట్ల తగిన బాధ్యత తీసుకోవాలి.
-బంగార్రాజు ఎలిపే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు – ( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>