నా కథ-18(ఇంటర్మీడియట్ తిరుమలగిరి) – డా.బోంద్యాలు బానోత్(భరత్)

పదవి విరమణ చేసిన ఒక టీచర్, తెల్ల డ్రెస్( లాల్చీ పైజామా) వేసుకోని, నెలకోసారి వచ్చే వాడు. సాయంత్రం పూట ఆ గుడిలో ఉన్నవాళ్ళను పిలిచి రవుండ్గా కూర్చోబెట్టి, ఏవేవో చెప్పేవాడు. నేను సందర్భానికి తగినట్లుగా ప్రశ్నలు వేసే వాడిని. ఐతే, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేసేవాళ్ళు. అప్పుడప్పుడు ఒక ఇనుప కుర్చీ పై ఒక ఫోటో పెట్టీ దానికి సన్నటి దండా చేసేవాళ్ళు. ఆ ఫోటో ముందు ఒక చిన్న హుండీ పెట్టే వాళ్ళు. ” ఇదిగోండి ఈ ఫోటో లో ఉన్నది గురువు, ఐతే మనమందరము గురు దక్షిణగా మనకు కలిగినంతా లేదా తోచినంతా ఆ హుండీలో వేసి దండం పెట్టుకోవాలి.” అని దొర మా అందరితో చెప్పేవాడు.
ఐతే, నేను అప్పటికే ఒక సంవత్సరం పాటు ‘ఎస్ ఎఫ్ ఐ’ లో పని చేశాను. అనేక విద్యా వైజ్ఞానిక తరగతులకు అటేండై ఉన్నాను. ఆ సమయంలో కూడా సూర్యాపేట డివిజన్, నల్గోండా జిల్లా ‘ఎస్ ఎఫ్ ఐ’ లో. పని చేస్తున్నాను. అందుకే కావచ్చూ వాళ్ళ ప్రభావం, నాపై ఈసమంతైనా కూడా పడలేదు.
ఐతే, ఆ రోజు సాయంత్రం వరకు దొర గుడిలో గదిని ఖాళీ చెయ్యాలి. మార్నింగ్ కాల్లకృత్యాలు తీర్చుకోని, స్నానం చేసి, తయ్యారై అద్దెకు ఒక గది వెతకడం ప్రారంబించాను. అదే గ్రామానికి చెందిన సీపీయం పార్టీ లీడర్ ‘మల్లయ్య’ ఉండేవాడు. ఆయన సీపీయం పార్టీ నుండి మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. దొర గుడిలో జరిగిన విషయం అంతా ఆ మల్లయ్యకు వివరించాను. వేరే అద్దె గది కోసం వెతుకుతున్న అని అతనితో చెప్పెను. ఐతే అతను ఆ దొరతో మాట్లాడుత, అదే రూములో ఉండనియమని అడుగుతా, నేనడుగుతే అయన కాదనడు. గడిలో ఉంటావా, అని అడిగాడు. అప్పుడు నేను ‘కుదురదు’ అని అన్నా ను.. ఎందుకంటే నేను ‘ఎస్ ఎఫ్ ఐ’ లో పని చేస్తున్నా ను. దొర ఏమో! ‘ఆర్ ఎస్ ఎస్’ భావజాలంతో ఉన్నాడు. ‘ఏబీవీపీ’ వాళ్ళు కూడా అతనితోనే ఉన్నారు. ఐతే, ఈ రెండు విరుద్ధమైన శక్తులు. వీటిమద్య పచ్చి గడ్డి వేస్తే భగ్గు మనేలా ఉంటుంది. అలాంటప్పుడు ఈ రెండు విరుద్ధమైన శక్తులు ఒకే ఇంట్లో ఉండటం మంచిది కాదు, అని భావించి, నా కోసం అద్దెకు ఒక గది వెతకడం ప్రారంబించాను.
ఎట్టకేలకు మా కాలేజీలోనే ఎంపీసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో మూడవ వాడిగా చేరాను. ఆ రూం మా కాలేజీకీ వాకబుల్ దూరంలో ఉండేది. మా ‘రూమ్’ తిరుమలగిరి గ్రేన్ మార్కేట్ వెనకాల ఉండేది.
ఐతే, ఎట్టకేలకు రూమ్ దొరకడంతో, అదే రోజు సాయంత్రం 5:30 గం. లకు, ఒక మిత్రుడి వద్ద సైకిల్ అడిగి తెచ్చుకున్నాను. నా సామాన్; అన్నం వండ్డే గిన్నె, కూర వడ్డే గిన్నె, రెండు ప్లేట్లు, ఒక గ్లాసు, రెండు గరిటేలు.. రెండు జతల బట్టలు..అన్నీ ఒక యూరియా బస్తా సంచిలో సదిరాను. సైకిల్ కీ వెనకాల ఓ సన్నటి తాడుతో గట్టీగా కట్టాను. ఇక వెళ్ళి పోదామగా, ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఐతే ,” మంచో-చెడో కాని, ఒక సంవత్సరం గడి-రూములో ఉచ్చితంగానే ఉండీ చదువుకున్నాను. దానికి కృతఘ్నతగా ఒక మాట ‘ వెళ్ళి పోతున్నా దొర ‘ అని చెప్పీ పోదామనిపించింది.
‘ నమస్కారం దొర గారు’ , మీరు చెప్పిన విధంగానే నేను ఖాళీ చేసి వెళ్ళి పోతున్నాను. ఇదిగోండి, నా చిన్న చిన్న సామాన్లు బస్తా సంచిలో వేసుకుని సైకిల్ మీద వేసుకున్నాను. ఎందుకంటే! చెప్పలేము రేపటికాడా గడిలో ఎదేనా జరగరానిది జరిగితే, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను కనుక, అది నా పై తోయడం.. చేసే..అవకాశం ఉంటుంది. అందుకే మీరోక్కసారి చెక్ చేసుకోండి” అని అన్నాను.
అప్పుడు ఆ దొర ” అరే! ‘బొంద్యాలు’ నువ్వు మిగతా వాళ్ళు కంటే తర్వాత వచ్చినవు. నేను, ఈ సంవత్సరం అంతా గమినిస్తునే ఉన్నా. మిగతా వాళ్ళకు మరియు నీకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నీవు మాట మీద నిలబడే వ్యక్తివీ. వాళ్ళు తిన్నచోటనే మరిచి పోయేవారు. నీలో నిజాయితీ చూశాను. ఏదో ! ఆ ఎర్రజెండా పార్టీలో పని చేస్తున్నావు కనుకనే ఖాళీ చెయ్యమన్నాను, లేకుండే నిన్ను ఇక్కడ నుండి పొమ్మనేదే లేదు. ఇప్పుడైనా సరే, నువ్వు ఇక్కడే ఉండి చదవాలనుకుంటే, ఉండి చదువుకో, నాకేమి అభ్యంతరం లేదు ” అని అన్నాడు దొర.
నా పట్ల(మీద) మీకు మంచి అభిప్రాయం ఉన్నందుకు, నాకు సంతోషంగా ఉంది. కాని ఒక సారి మీరు గది ఖాళీ చెయ్యమన్నాకా, నేను ఈ గడి నుండి వెళ్ళి పోవాలని, నిర్ణయించుకున్నాకా, ఇక మళ్ళీ వెనకకు తిరిగి చూసే ఆలోచన లేదు. నేను, ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళి పోవడమే అన్నీ విధాలుగా మేలు. దొర గారు, వెళ్ళుతున్నాను” అని, చెప్పీ , సైకిల్ సెంట్రల్ స్టాండ్ తీసి, గడికి వెలుపల వరకు సైకిల్ ని చేతితో పట్టుకొని నడిపించి, బయటికి వచ్చాకా సైకిల్ ఎక్కి, ఆ సామానును ఇప్పుడు మారిన రూములోకి తెచ్చాను. రూము కిరాయి నెలకు ఒక వ్యక్తికి 150 రూ. మేము ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం. ముగ్గురి పొత్తుల నెలకు 450 రూ. చెల్లించే వాళ్ళం. గుడిలోని గది ఖాళీ చేయడంతో , నాకు అనవసరమైన మెంటల్ టెన్షన్ తగ్గింది.
ఇప్పుడు యదావిధిగా కాలేజీకి వెళుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పూర్తి కావస్తోంది. ఇంకో మూడు నెలల్లో పెళ్లి కూడా పెట్టుకున్నాను. పెళ్లి పనుల్లో నిమగ్నమైనాను. పరీక్షల తర్వాతే పెళ్లి పెట్టుకున్నాను. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నందున, కామర్స్ పరీక్ష సరిగ్గా రాయలేక పోయాను. పెళ్ళైన మూడు రోజులకు ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. అన్ని సబ్జెక్టులు పాసైనాను. కాని కామర్స్ ఒక్కటే ఫేయిల్ అయ్యాను. పెళ్లి చేసుకున్నా సంబరం కూడా లేకుండా పోయింది. ఫేలయిన విషయం అత్తారింటివాళ్ళకు కూడా తెలిసింది. వాళ్ళు కూడా లోలోన బాధపడ్డారు.
ఐతే, రిజల్ట్స్ తో పాటుగా ఒక్క సబ్జెక్ట్ ఫేయిల్ అయిన వాళ్ళకు ఇన్ స్టాంట్ పరీక్షల టైమ్ టేబుల్ కూడా వచ్చింది. పరీక్షలకు 12రోజుల సమయం ఉంది. అది జూన్ – జూలై మాసాల సమయం. ఎండలు అప్పటికి తగ్గలేదు.ఇంటి వద్దా అంటే పరీక్షాకు ప్రిపేర్ కావడం కష్టమౌతుంది. ఈ విషయం సీపీయం పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్య తో చెప్పాను. ఆయన ” భరత్, ఈ విషయానికి ఎందకంత పరేశానౌతున్నావు? ఈ 10-12 రోజులు మనింట్లోనే ఉండీ, ఇక్కడే మాతోనే భోజనం చేసి, పరీక్షకు ప్రిపేర్ చేసుకో. పరీక్ష మంచిగా రాసుకో .” అని అన్నాడు. నాకు చాలా సంతోషమనిపించింది. రోజు టయిమ్ కు తిని, చదువుతున్నాను. రోజు ఆరుబైటా అరుగుమీద పడుకుంటున్నాను. ఒక రోజు మార్నింగ్ లేచి చూసే సరికి, నేను పడుకున్నా అరుగునానుకోని ఉన్నా గోడకు ఒక పోస్టల్ అతికించీ ఉన్నది. ” కా. వీరన్న అమర్ హే” అని రాసి ఉంది. ఒక గొప్ప విప్లవకారుడు చనిపోయాడు. అంటే ఇతరుల చేత చంపబడ్డాడు, ప్రభుత్వమే చంపింది. నాకు చాలా బాధేసింది. రెండు రోజులు పోతే, నా ఇన్ స్టాంట్ పరీక్షా తేదీ వస్తుంది. మనసులో చాలా బాధ ఉన్నప్పటికీ, పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. చివరికి పరీక్షా రాశాను. మండల అధ్యక్షుడు ‘మల్లయ్య’ తో చెప్పీ ఇంటికి వెళ్ళాను.
పెళ్ళై నెల పదిహేను రోజులౌతున్నాయి. పెళ్ళైన కొత్తలో ఊర్లు తిరగడమే ఎక్కువగా ఉంటుంది. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. జూలై నెల చివరిలో ఇన్ స్టాంట్ పరీక్షా ఫలితాలు విడుదల అయినవి. రిజల్ట్ చూసుకొనగా, పాస్ అయ్యాను.
అప్పటికే నా మిత్రుడు ‘మాన్యా’ మొదటి సారిగానే పాసై హన్మకొండలోని ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాలలో, బీఎ లో ప్రవేశం పొందాడు. ఈ విషయం నాకు ఉత్తరం రాసి తెలియజేశాడు. హన్మకొండలోని , ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో అప్పటికే అడ్మీషన్లు అయిపోతున్నాయి. ఐతే, ఇన్ స్టాంట్ లో పాస్ అయిన వాళ్ళకోసం సీట్లు పెంచాలని, అడ్మీషన్లు ఇవ్వాలని ఆర్ట్స కళాశాల ముందు ఎస్ ఎఫ్ ఐ వాళ్ళు బైటాయించారు. ఆ బైఠాయించిన వాళ్ళ లో జిలుకర శ్రీ నివాస్ నినాదాలు ఇస్తున్నారు. ప్రిన్సీపాల్ వచి ” ఇక్కడా, విద్యార్థి నాయకులకు చెప్పేది ఏమిటంటే! మీరు ఏమి దిగులు పడకండి. ఇన్ స్టాంట్ లో పాస్ అయిన వాళ్ళకోసం సీట్లు కెటాయిస్తాం. తెలుగు మీడియంలో కొన్ని సీట్లున్నాయి. అవి సరిపోకపోతే ఇంగ్లీష్ మీడియం మీడియంలో అప్లయి చేసుకోండి. దాదాపు అప్లయి చేసుకున్న వాళ్ళందరికీ సీట్లో స్థాయి. కావున ఈ ధర్నా ను విరమించాలని కోరుతున్నాను.” అని అన్నాడు.
అందరికీ సీట్లోస్థాయి అనడంతో అందరి మొఖాన సంతోషం కనిపించింది. ఆ ధర్నా అయిపోయిన తర్వాత, నేను జిలుకరను కలిసాను. ఆయన ‘స్టేషన్ గన్ పూర్’ డివిజన్ ‘ఎస్ ఎఫ్ ఐ’ లో పని చేసినప్పుడు నేను మహబూబాబాద్ డివిజన్ ‘ఎస్ ఎఫ్ ఐ’ పని చేశాను. మేము తరుచూగా మీటింగులలో, విద్యా వైజ్ఞానిక తరగతులలో కలుసుకొనే వాళ్ళం. నన్ను చూడగానే గుర్తు పట్టాడు. అప్లయి చేయడంలో, సహాయం చేశాడు. తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా అప్లై చేయమన్నాడు. అలాగే చేశాను. తెల్లారి ఫలితాలు విడుదల చేశారు. నాకు ‘బీఎ’ ఇంగ్లీష్ మీడియంలో, ఆర్ట్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో సీటోచింది. ప్రవేశం పొందాను. నా మిత్రుడు ‘మాన్యా’ కూడా నాతోనే ఉన్నాడు. ఆయన రూం లో ఉండి ఈ కార్యక్రమం అంతా చేశాను..
— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
నా కథ-18(ఇంటర్మీడియట్ తిరుమలగిరి) – డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>