“రోహిత్ వేముల”(కవిత)–బాలాజీ పోతుల

ఆగిన గుండె ఈనాటికి దశాబ్దం!
ఆ గుండె డప్పై కొట్టుకుంటూనే ఉంది.
ఈ దశాబ్ద కాలమంతా…
దళిత గుండెల్లో నిప్పులు రాజేస్తూనే ఉంది.
ఇంకా ఆ నిప్పు రవ్వలు ఎగిసెగిసి పడుతూనే ఉంటాయి
ఈ కుల మతోన్మాద రాజ్యంలో
బతకడమే నిరసనగా బతుకుతున్న వాళ్ళం
హైందవమంటూ సనాతనమంటూ
దారిద్ర్య రేఖకి దిగువన అంటరానితనానికి దగ్గిరిగా
ఇంకా ఇంకా వెలివేయబడుతూనే ఉన్నాం
దేశపు నలుమూలల్లో ఏం కర్మ!
నడిరోడ్డు పైనే నడి నెత్తిన సూర్యుడి సాక్షిగా నరకబడుతున్నాం.
మా పుట్టుకతోనే చావుని వెంట తెచ్చుకున్న వాళ్ళం
రోజూ చస్తూ బతుకుతున్న వాళ్ళం
మేమింకా రిజర్వేషన్ల గాళ్ళం
అయినా మాదింకా అంటరాని కులమే
ఏదేమైనా మేమూ మనుషులమే
మావీ మీవీ ఒకే ప్రాణం, ఒకే రక్తం!
కాకపోతే చెప్పండి –
మీముందే సామూహికంగా ఉరేసుకొని చస్తాం
మీ పనిని సులభతరం చేస్తాం
అప్పుడైనా మా బతుకులు లేకుండా
మీ బతుకులు సాగవని తెలిసొస్తుంది
అప్పుడు చావాల్సింది మేము కాదు మీరు.
గుర్తుంచుకోండి –
ఒక్క రోహిత్ వేముల పోతే,
కోటానుకోట్ల రోహిత్ వేములలు పుట్టుకొస్తారు
మీలా కత్తులతో కాదు
చూపుడువేళ్ళ దిశా నిర్దేశనాలతో
మీ కులోన్మాద కుళ్ళుని
మతోన్మాద మదాన్ని
తెగ నరుకుతాం
సమానత్వపు నీలి బావుటా నెగరెస్తాం!
విప్లవమై ఎప్పటికీ ఆరని అగ్నిలా వెలుగుతూనే ఉంటాం.
నిప్పు రవ్వల్ని రాజేస్తూనే ఉంటాం.
-బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
“రోహిత్ వేముల”(కవిత)–బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>