మతం పులి (కవిత)-తోకల రాజేశం
చరిత్ర పొడవునా మతం
నిరంతరం రక్తసిక్త దారులను పరుస్తూనే ఉంది
మనమే వాటిని
అశోకుడు వేసిన బాటల్లాంటివని
భ్రమపడుతున్నాం
పురుషుని చెప్పుచేతుల్లో
భద్రంగా అఘోరించమని
చుట్టూ దైవ శాసనాలను అల్లింది కానీ
మహిళను మనిషిగా
ఏమతం చూసింది చెప్పు?
ఏ మట్టిలో పుట్టినా
పచ్చగా విస్తరించే నీడలాంటి
చెట్టు కాదు మతం
దానికి ఖచ్చితంగా కోరలుంటాయి
అవి మెదట్లో మొదట్లోనే దిగుతాయి
అధికారం కుర్చీ కింది
నాలుగో కాలు విరిగినప్పుడల్లా
ఆదుకునేది మతం
అది మామూలు మనిషి
గుండె చప్పుడెప్పుడూ కాదు
నిజానికి మనిషి రక్తం మరిగిన పులి-మతం
మతాలను, వర్గాలను, కులాలనూ
సప్త సముద్రాల్లో ఖననం చేసి
ప్రేమైక మానవ సంగీతాన్ని
ఆలపించాల్సిన సందర్భంలో
అమాయకుల ప్రాణాలను మతం
తుపాకీ గొట్టాలు పీలుస్తున్నాయి
ఈ భూమిని కేవలం
మా మతపు సంకెళ్లతోనే బంధించాలని
చూసే వెర్రి తత్వ వాదులు
చిలుకలు వాలని చెట్టులా
మిగిలిపోయిన మతాన్ని ఏం చేసుకుంటారు?
మెదల్ల నిండా చీకట్లు నిండిన చోట
మనవత్వమే ప్రేమ జ్యోతులు వెలిగించాలి
విశ్వ మానవ సౌబ్రాతృత్వం ఈ భూగోళం మీద
ప్రాణ వాయువై పచ్చగా విస్తరించాలి.
-తోకల రాజేశం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
మతం పులి (కవిత)-తోకల రాజేశం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>