చూపుడు వేలు నీడ(కవిత) -తోకల రాజేశం

ఆయన ఎన్నినిద్రలేని రాత్రులను
అక్షరాలతో వెలిగించుకుంటే తయారయ్యిందో
ఎన్ని చెమటచుక్కలను
మహాగ్రంథం మీద నాటితే చిగురించిందో
అన్నికాలాలూ పండ్లనిచ్చే
మహా వృక్షమయ్యింది రాజ్యాంగం
నా తాతముత్తాతల నాలుకల మీద
నాట్యమాడటానికి నిరాకరించిన
చదువుల తల్లి
రాజ్యాంగం చెప్పిందనే కదా!
మా గుడిసెగూటిలో
పుస్తకమై వాలిపోయింది
ఏమీ లేని ఖాళీ చేతులకు
ఓటు హక్కును తొడిగితేనే కదా!
నేనూ మనిషినే అని నమ్మకం
గుండెల్లో స్థిరపడింది
సూర్యుని సాక్షిగా
మట్టిలోనుంచి రెక్కల బొక్కెనలతో
సమస్తమూ
తోడుకొచ్చిన నల్లటి కడుపులకు
తరతరాలుగా ఆకలి
అగ్ని గుండమై దహిస్తే
రాజ్యాంగం కదా!
నీ కష్టాన్ని సరాసరి
నీ గుమ్మిలోకి ఒంపింది
భూమి బరువును సగం మోస్తున్న
మహిళా లోకానికి స్వాతంత్ర్యాన్ని
నిషేధించిన ‘మనుఅధర్మ ‘శాస్త్రాన్ని
ఆగ్రహజ్వాలల్లో మసిచేసిన ఆ చేయి
రాజ్యాంగంతో హక్కు పత్రాలను
రాసిస్తేనే కదా
ఈనాడు సింహాసనం మీద
సివంగులై గర్జిస్తున్నది
ఎంత మోసం
ఎంత దుఃఖం
ఎంత దారుణం
తరతరాలుగా కన్నీళ్ళను
మాత్రమే తాగుతూ
దయతో విసరేసిన ఎంగిలికూడును
కళ్లకద్దుకుంటూ
మురికి బట్టలను బాధ్యతగా
చుట్టుకుంటూ
ఎవరికోసం పుట్టామో?
ఎందుకు చచ్చామో?
నా తలను ముట్టినవాడూ లేడు
దాని మీద మంచిదేదో
రాసిన వాడూలేడు
రాజ్యాంగం ఈ దేశం
తలరాతను తిరగరాసింది
మా తలమీద చెట్టునీడయ్యింది
ఆ చూపుడు వేలు
నీడకిందనే కదా
మొదటిసారిగా
మనమంతా సమనమయ్యాం.
-తోకల రాజేశం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
చూపుడు వేలు నీడ(కవిత) -తోకల రాజేశం — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>