నా స్మృతుల్ని సమాధి చేయగలవా..!! (కవిత)- ముక్కమల్ల ధరిత్రీ దేవి
నా స్మృతుల్ని సమాధి చేయగలవా..!!
(కన్నతల్లికి ఓ చిన్నారి సూటి ప్రశ్న.. )
అమ్మా..నేచేసిన నేరమేమిటమ్మ !
అంత ప్రేమ అంతలోనె ఎలా మాయమైపోయెనమ్మా..!
ఆటాడుతూ పడిపోతే అల్లల్లాడిపోతావు..
బువ్వ తినిపిస్తూ పొలమారితే..
కలవరపడతావు ! నేనేడిస్తే నీ కంట కన్నీరు !
నే నవ్వితే నీ మోమున కోటి కాంతులు !!
‘అమ్మా’అని పిలిస్తేచాలు అక్కున జేర్చుకుంటావే…
మరి..ఆ పిలుపు వద్దంటూ ఎందుకమ్మా
నా నోరు నొక్కేయాలనుకున్నావు..!?
లాలపోసి..జోకొట్టి..నిద్రబుచ్చి న ఆ చేతులు..
పౌడరద్ది..దిష్టిచుక్క పెట్టి..ఫ్రాకు తొడిగి
బుట్ట బొమ్మలా తీర్చిదిద్దిన ఆ చేతులు..
ఎలా బిగించాయమ్మ ఉరి..నా లేత గొంతుకు..!?
అర్ధరాత్రి ఆకలికేడిస్తే..నోటికందిన
ఆ పాలధారల కమ్మదనం..మరువగలనా !
నను హత్తుకుని..ఆదమరిచి నీవు
నిదురించడం నాకింకా గురుతే..!!
తప్పటడుగుల నాడు అంబరాన్నంటిన
నీ సంబరం..ఎక్కడ?అదృశ్యమైపోయెనా..!
నా చిలుకపలుకులు నిన్నలరించిన క్షణాలు
నాకెరుకే..అంతలోనే అంత చేదెలా అయితినమ్మ!!
అత్తింట ఆరళ్లు..అదనపు కట్నపు సెగలు..
అప్పుల బాధలు..నిను చుట్టుముడితే..
నాన్న అరాచకాలు నిను వేధిస్తే…
శిక్ష నాకు వేశావేమిటమ్మా!
ఎదురీత చేతగాక తలరాత మార్చాలనుకున్నావు..
నువ్వు లేక నా అనాథ బ్రతుకు
ఊహించలేకపోయావు..చివరికి..
మిగిలిందేమిటమ్మ..!! నా ఆయుష్షు కూడా
పోసుకుని నీవు మాత్రం మిగిలావు..!!
సమస్యలు వేధిస్తే బ్రతుకులు చిదిమేయాలా !
పది నెలలు కడుపున మోశావు..
మరణం అంచులు తాకి..
మరో జన్మ ఎత్తి..నాకు జన్మనిచ్చావు..
ఆ పాటి కడగండ్లు నీకు దూదిపింజలే..
సహనానికి మారుపేరు నీవు..
అంత కఠినంగా ఎలా మారిపోయావు..!?
ఇప్పుడు తీరాయా నీ వెతలు !!
సమసిపోయాయా నీ సమస్యలు !!
అమ్మా! నీకో ఊరట..కన్నుమూసిన
నీ కంటి పాపకు ఇక నిశ్చింతేలే…
నాలాంటి అభాగ్యులు కోకొల్లలిక్కడ.!
అమ్మ చేత..నాన్న చేత హతులై..
నాకు తోడుగ ఉన్నారిచట..
నా బెంగ నీ గురించి..!!
ఎలా మోయగలవమ్మ..
నీ జీవితకాలం దహించే ఆ వేదన !!
నన్ను సమాధి చేశావు..
నా స్మృతుల్ని చేయగలవా..!!
నా అభ్యర్థన ఒక్కటే.. దయచేసి..
మళ్లీ ఉరి బిగించుకోకు…
నన్ను వెతుక్కుంటూ..నా చెంత చేరకు…

Comments
నా స్మృతుల్ని సమాధి చేయగలవా..!! (కవిత)- ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>