కల్మషమెరుగని పసిపాప (కవిత ) – ముక్కమల్ల ధరిత్రీ దేవి
చిరు మందహాసం నను పలకరిస్తే చాలు..
గోముగ అమ్మ తినిపించే గోరుముద్దలు..
ఆ మెడను చుట్టి దాగుడుమూతలాడే
నా లేలేత చేతులు..బుడిబుడి రాగాలతో
మారాం చేసే నను బుజ్జగిస్తూ బడిని దిగబెట్టే
ప్రియమైన నాన్న ప్రేమ చూపులు…
కనుల ముందు కదలాడి..నిద్రాణమైపోయిన
నా బాల్యం నను తట్టి మేల్కొలుపుతుంది…
అదిగో ఆ క్షణాన..కావాలంటుంది నా మనసు
మరలా..నా పసితనం..!
యవ్వన ఛాయలు దోబూచులాడుతూ..
నల్లని జడ చేతికి చుట్టుకుని
జడకుప్పెలు తిప్పుతూ..
చిరుసవ్వడులు చేసే
పాదాల పట్టీలతో..
ఓణీ బిగించి హంసలా
నడిచొచ్చే అమ్మాయిని చూస్తే చాలు…
బాధలు..బరువులు..
బాధ్యతలు దరిజేరని
ఆనాటి పదహారేళ్ల
నా వయసు గురుతుకొచ్చి..
నామోము సిగ్గులమొగ్గే అవుతుంది…
అదిగో అప్పుడే..
మళ్లీ కావాలంటుంది నామది…
జారిపోయిన ఆనాటి నా సోయగాన్ని..!!
నడి వయసులో నడిసంద్రంలో ఎదురీత..!
ఏమిటీ తలరాత ! అనుకున్న క్షణాలు !
వేదనలో మునిగిపోతూ అలసిపోతూ..
విసిగిపోతూ..అయినా సరే..
“అవి తీయని బానిసత్వ బాధలే !
అయినవారికందించే ఆత్మీయ సేవలే”
అనుకున్న సర్దుబాటు రోజులు !
అలుపెరుగని ఆ పయనం…
ఎదను కుదిపేస్తూ..
నేడు ఎదర నిలిచినా సరే…
ప్రయాసమరిచి..
మరీ మరీ కోరుకుంటుంది
పిచ్చిమనసు..
మరోసారి మళ్ళీ అదే పయనం !!
నేడు ముదిమి మీద పడి..
‘మన’ అనుకున్నదంతా మాయమైపోయి…
గతాన్ని తిరగదోడితే..చెక్కుచెదరని
ఆ జ్ఞాపకాల దొంతరలు శిలాక్షరాలై..
సజీవంగా కదలాడుతూ..మదిని
అలజడి రేపుతూ..ఏ చిట్టితల్లి కంటబడినా…
ఏ అందాలరాశి ఎదురైనా…
బాధ్యతల బరువుతో వంగిపోయి
నడయాడే ఓ అమ్మ నా వంకజూసినా…
అదిగో..! మళ్లీ నా మది కోరుకుంటుంది
మరీ మరీ..తిరిగి రాలేని నా గతాన్ని
నాకు తిరిగివ్వమని..కష్టమైనా సరే..
ఇష్టమైన ఆ పయనం నాకెంతో ఇష్టమని…!
-ముక్కమల్ల ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
కల్మషమెరుగని పసిపాప (కవిత ) – ముక్కమల్ల ధరిత్రీ దేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>