కలత కవిత “కల”(కవిత) చందలూరి నారాయణరావు
1.
ఏ అక్షరాన్ని తట్టి పిలిచినా
తలుపు తీసే రాత్రులెన్నో…
రుచి లేని రోజుల మధ్య
పస్తులున్న నాలుక నైపుణ్యం ఎంతో…
2
కాల్చినా, పూడ్చినా
నొప్పి, బాధ ఎరుగని జీవి
ఆఖరి చూపు వ్రాసే
అంతిమ వాక్యం కోసం ఆశగా చూస్తుంది.
3
మనిషి అనే పదం లేని
గొప్ప నిఘంటువు
నేటి సంఘం
4
వంద అడుగుల్లో
ఒక్క అలుపు చెప్పే మాట
ఇంకో అడుగు అప్పు తీసుకుని
ముందుకు పొమ్మనే
5
విలువలు విరిగి పడుతుంటే
మనిషి రూపంలోనైనా వచ్చి
కాలాన్ని మాట్లాడిస్తాడు.
ఎంతైనా దేవుడు చదువుకున్నాడు కదా
.
6
డబ్బు లేని రోజుల్లో
ధర్మం భక్తిని నడిపించింది.
డబ్బు సృష్టించిన లోకంలో
దేవుడిని ధనం నడిపిస్తుంది
7
కాలానిది
లిపి లేని భాష.
అర్ధం చేసుకోవాలి అంతే.
8.
ఓ నరకం రచించిన
స్వర్గాన్ని అందరూ అనుభవించి తీరాలి
ఇది ఆధునిక మరణ శాసనం.
9.
కిటకిటమని కొట్టుకునే పేజీల మధ్యలో
ఓ వాక్యాన్ని లాక్కొచ్చి దిండు కింద దాచా
నిద్రలో ఏ కల ఆకలితో చావకూడదని
10
నేటి శత్రువుగా
మారిన నిజం
రేపు ఆయుధం.
11
బడి అంటే గుడికి ఇష్టం
పాఠాలతో చిగురించే
బాల్యానికి చిరునామా అదేనని
12.
అజ్ఞాత భాషలో
వ్రాసిన స్వప్న లేఖలో
అచ్చు తప్పు పడని ఒక్క పదం ప్రేమ
13.
నమ్మకమనేది
బతుకు లోకంలో
హృదయ తీరంలో దొరికే
అతి విలువైన వస్తువు.
14.
బాగా పాచి పట్టిన
అనుభవం పై
కాలు పడ్డప్పుడల్లా
అరచిన అరుపే గొప్ప కవిత.
15
చరిత్రలో ఏ యుద్ధమైనా
చావునే ప్రేమించింది.
నాశనాన్ని దీవించింది
16.
భాష తెలియని నిద్ర
మనసుపై వ్రాసిన
కలత కవిత కల.
….. చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Comments
కలత కవిత “కల”(కవిత) చందలూరి నారాయణరావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>